Share News

పంట కాలువల్లో పూడికలు

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:50 AM

శారదా నదిపై ఉన్న గ్రోయిన్ల ద్వారా తుమ్మపాల మీదుగా ప్రవహించే పంట కాలువలు చెత్తా చెదారాలతో నిండిపోయాయి. నీటి ప్రవాహం పూర్తిగా మందగించి, ఆయకట్టుకు నీరు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ పొలాలకు నీరు వచ్చినా.. చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నల్లగా వుంటున్నది. పైగా దుర్వాసన వస్తున్నది. మరోవైపు తుమ్మపాలలో పంట కాలువల పక్కన నివసిస్తున్న వారు నిత్యం దుర్గంధం, దోమలు, ఈగల బెడదతో రోగాలబారిన పడుతున్నారు.

పంట కాలువల్లో పూడికలు
తుమ్మపా ల వద్ద చెర్లోపలి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం

తుమ్మపాలలో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు

పంటలకు నీరు అందక రైతుల ఇక్కట్లు

గ్రామస్థులకు దుర్గంధం, దోమల బెడద

పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

తుమ్మపాల (అనకాపల్లి), మార్చి 6 (ఆంధ్రజ్యోతి): శారదా నదిపై ఉన్న గ్రోయిన్ల ద్వారా తుమ్మపాల మీదుగా ప్రవహించే పంట కాలువలు చెత్తా చెదారాలతో నిండిపోయాయి. నీటి ప్రవాహం పూర్తిగా మందగించి, ఆయకట్టుకు నీరు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ పొలాలకు నీరు వచ్చినా.. చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నల్లగా వుంటున్నది. పైగా దుర్వాసన వస్తున్నది. మరోవైపు తుమ్మపాలలో పంట కాలువల పక్కన నివసిస్తున్న వారు నిత్యం దుర్గంధం, దోమలు, ఈగల బెడదతో రోగాలబారిన పడుతున్నారు.

శారదా నదిపై తుమ్మపాల వద్ద గ్రోయిన్‌ వుంది. దీని నుంచి మూడు కాలువల (చెర్లోపలి కాలువ, నడిమి కాలువ, దీపాల కాలువ) ద్వారా సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ కాలువలకు అనుబంధంగా వున్న అనకాపల్లి ఆవఖండంలో మరో రెండు వేల ఎకరాల ఆయకట్టు వుంది. మొత్తం మీద నాలుగున్నర వేల ఎకరాలకు ఈ కాలువల ద్వారా నీరు సరఫరా అందాలి. అయితే తుమ్మపాల గ్రామంలో నుంచి వెళుతున్న ఈ కాలువల్లో ఇరిగేషన్‌ అధికారులు నిర్వహణ పనులు చేపట్టలేదు. చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయాయి. నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా వున్న సమయంలో కూడా కాలువల్లో సరిగా నీరు పారడంలేదు. ప్రస్తుతం తుమ్మపాల గ్రోయిన్‌ పరిధిలోని భూముల్లో నువ్వు, పొద్దుతిరుగుడు, మినుము, పెసర, వేరుశనగ, టొమేటో, వంగ, బెండకాయ, తదితర పంటలు సాగులో వున్నారు. కాలువల నుంచి నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.

తుమ్మపాలలో దోమల బెడద

తుమ్మపాల గ్రామం మధ్య నుంచి వెళుతున్న మూడు కాలువల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోవడంతో డ్రైనేజీ కాలువల్లా తయారయ్యాయి. మురుగు నీరు నిలిచిపోయి దోమల నిలయాలుగా మారాయి. కాలువలకు ఇరువైపులా నివాసం వుంటున్నవారు దుర్వాసనతోపాటు దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారు.

కాలువల్లో చెత్తాచెదారం తొలగించాలి

కొణతాల మోదినాయుడు, రైతు, తుమ్మపాల

చెర్లోపలి కాలువ కింద మాకున్న భూమిలో రబీలో మినుము పంట వేశాను. కాలువ నుంచి నీరు రాకపోవడంతోపాటు కొద్ది రోజుల నుంచి ఎండలు మండిపోతుండడంతో పంట ఎండిపోతున్నది. కాలువల్లో పూడిక తీసి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇరిగేషన్‌, పంచాయతీ అధికారులు స్పందించి పంట కాలువల్లో పూడికలు తీయించాలి.

Updated Date - Mar 07 , 2025 | 12:50 AM