Share News

హక్కులపై మాట్లాడితే షోకాజ్‌ నోటీసులు!

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:27 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలపై ఎవరైనా మాట్లాడితే వారికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి బెదిరిస్తోంది.

హక్కులపై మాట్లాడితే షోకాజ్‌ నోటీసులు!

  • ఉక్కు యాజమాన్యం వింతవైఖరి

  • నాడు జీతాల కోసం ధర్నా చేసిన ఉద్యోగులకు...

  • నేడు సీఐటీయూ నాయకుడు అయోధ్యారామ్‌కు...

విశాఖపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలపై ఎవరైనా మాట్లాడితే వారికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి బెదిరిస్తోంది. బకాయి పడిన జీతాల గురించి ఉన్నతాధికారి కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించిన ఉద్యోగులకు గతంలో నోటీసులు జారీచేసింది. ఇప్పుడు కాంట్రాక్ట్‌ కార్మికుల తగ్గింపు, హెచ్‌ఆర్‌ఏ కోత, విద్యుత్‌ చార్జీల పెంపు, వీఆర్‌ఎస్‌ వంటి అంశాలపై మీడియాతో మాట్లాడుతున్నారని, సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ సీఐటీయూ గౌరవ అధ్యక్షులైన అయోధ్యారామ్‌కు గురువారం షోకాజ్‌ నోటీసు జారీచేసింది. ఉక్కు ఉద్యోగిగా పనిచేస్తూ సంస్థకు నష్టం జరిగేలా మాట్లాడుతున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది.

పోరాడి తీరుతాం: అయోధ్యారామ్‌

షోకాజ్‌ నోటీసు అందుకున్న అయోధ్యారామ్‌ గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్లాంటును ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే దానిని అడ్డుకోవడానికి ఉద్యమం చేస్తున్నామన్నారు. ఇటీవల ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు కోత పెట్టారని, అలాగే విద్యుత్‌ చార్జీలు పెంచేశారని, జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని, కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షణ్యంగా తొలగిస్తున్నారని వీటిపై మాట్లాడితే సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామని చెబుతున్నారని, దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. ప్లాంటును రక్షించుకోవడానికి, కార్మికుల హక్కుల కోసం యూనియన్‌ తరఫున పోరాటం చేస్తున్నామని, యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూస్తామన్నారు. షోకాజ్‌ నోటీసులకు బెదిరేది లేదని, ఇదే విధానంతో, కార్మికుల తరఫున గొంతు వినిపిస్తామని స్పష్టంచేశారు.

--------------------------------------------------------------------------------

స్టీల్‌ప్లాంటులో ప్రమాదం

కాంట్రాక్టు కార్మికుడికి గాయాలు

ఉక్కుటౌన్‌షిప్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు యుటిలిటీస్‌ విభాగంలో గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. విభాగంలోని ఏఎస్‌యూ-1 (ఎయిర్‌ సెపరేషన్‌ యూనిట్‌)లో ఆక్సిజన్‌ పంప్‌ ఒక్కసారిగా బరస్ట్‌ అయ్యింది. దాంతో ఆ ప్రదేశంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుడు సీహెచ్‌ ఆనందరెడ్డి (40)కి గాయాలయ్యాయి. అతడిని హూటాహూటిన ఉక్కు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆనందరెడ్డి శరీరం 40 శాతం మేర కాలిపోయినట్టు చెబుతున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 01:27 AM