Share News

మీ కోసం కార్యక్రమానికి గైర్హాజరైతే షోకాజ్‌

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:02 AM

మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాకుంటే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను హెచ్చరించారు.

మీ కోసం కార్యక్రమానికి గైర్హాజరైతే షోకాజ్‌
మీకోసంలో ప్రజల అర్జీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన జేసీ అభిషేక్‌గౌడ

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కువశ్‌ హెచ్చరిక

ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 52 వినతుల స్వీకారం

పాడేరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాకుంటే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను హెచ్చరించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కొంతమంది జిల్లా అధికారులు మీకోసం కార్యక్రమానికి హాజరు కావడం లేదని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఈ కార్యక్రమానికి అధికారులు గైర్హాజరైతే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని హెచ్ఛరించారు. అలాగే ప్రజల నుంచి తరచూ పునరావృతమవుతున్న వినతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

మీకోసంలో 52 వినతుల స్వీకరణ

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌ కలెక్టర్‌ శార్యమన్‌పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత ప్రజల నుంచి 52 వినతులను స్వీకరించారు. హుకుంపేట మండలం గూడ పంచాయతీ శివారు లకేపుట్టులో పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని, సీసీ రోడ్లు నిర్మించాలని సర్పంచ్‌ కంబిడి సరోజినికుమారి వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ప్రతినిధి వంతాల నాగేశ్వరరావు పర్యాటక ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని కోరగా, అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ దాసరితోట గ్రామానికి చెందిన పి.జమ్మన్నదొర, పి. ఎరుకులు, తదితరులు విద్యుత్‌ మోటరుతో వ్యవసాయబోరు మంజూరు చేయాలని కోరారు. అలాగే జీకేవీధి మండలం రింతాడ, అమ్మవారిధారకొండ, వంచుట్టు గ్రామాలకు చేరవగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు డి.మోహన్‌బాబు, సీహెచ్‌.గంగాభవాని, తదితరులు కోరగా, కొయ్యూరు మండలం మర్రివాడ పంచాయతీ గుడ్లపల్లి గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లే దారిలో కల్వర్టు నిర్మించాలని గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సి.జమాల్‌ బాషా, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ టి.కొండయ్య పడాల్‌, జిల్లా ఉద్యానవనాధికారి ఎ.రమేశ్‌కుమార్‌రావు, ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, ఐటీడీఏ ఏవో హేమలత, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ జవహార్‌కుమార్‌, జిల్లా ఖజానాధికారి ప్రసాద్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:02 AM