Share News

పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:28 AM

పేదల కోసం చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడింది. వర్షాలు తగ్గడంతో నిర్మాణాలు జోరందుకున్నాయి.

పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత

రోజుకు 500 టన్నులు అవసరం

200 నుంచి 250 టన్నులు రాక

శ్రీకాకుళం జిల్లాలో ఒక రీచ్‌ నిలిపివేత

రవాణా చార్జీల సవరణతో మారుమూలనున్న లేఅవుట్‌లకు ఇసుక సరఫరా చేసేందుకు ముందుకురాని లారీ యజమానులు

విశాఖపట్నం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):

పేదల కోసం చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడింది. వర్షాలు తగ్గడంతో నిర్మాణాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం లేఅవుట్‌లలో కూలీలకు సరిపడా పనులు చేయడానికి రోజుకు సగటున 500 టన్నుల ఇసుక అవసరం కాగా 200 నుంచి 250 టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కేటాయించిన రెండు రీచ్‌లలో ఒకటి తాజాగా మూతపడడం, రవాణా చార్జీలు తగ్గించారని ఇసుక రవాణాకు లారీ యజమానులు ఆసక్తి చూపకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

నగర శివారు మండలాల్లో 65కుపైగా లేఅవుట్‌లలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకునేందుకు ఇసుక కొరత అడ్డంకిగా మారింది. రోజుకు కనీసం 500 టన్నులు అవసరమవుతుందని అధికారులు అంచనా వేయగా 200 నుంచి 250 టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అన్ని లేఅవుట్‌లలో పనులు ఊపందుకుంటే ఇసుక డిమాండ్‌ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. రెండు నెలల క్రితం ఉన్న ఇబ్బందులు తొలగి సుమారు నెల రోజులపాటు రోజుకు రమారమి 450 టన్నులు వరకూ సరఫరా అయ్యింది. అయితే శ్రీకాకుళం జిల్లాలోని రెండు రీచ్‌లలో ఒకటి తాజాగా మూతపడింది. గడచిన వారం రెండు వారాల నుంచి ఒక రీచ్‌ నుంచే ఇసుక ఇస్తున్నారు. దీంతో శ్రీకాకుళం నుంచి రోజూ వచ్చే లారీల సంఖ్య తగ్గిపోయింది. గతంలో మాదిరిగా రెండో రీచ్‌ కేటాయించాలని కోరినప్పటికీ ఇంతవరకూ శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి రాలేదు. ఇదిలావుండగా రాజమండ్రి వద్ద గోదావరి నది నుంచి ఇసుక సరఫరాకు రీచ్‌ కేటాయించినా అక్కడ లిఫ్టింగ్‌లో ఇబ్బంది వచ్చింది. బయట నిర్మాణాల కోసం బిల్డర్లు పోటీ పడి పైరవీలు చేసుకోవడంతో విశాఖ జిల్లా అవసరాలకు సరిపడా ఇసుక ఇవ్వడం లేదు.

ఇదిలావుండగా ఇసుక రవాణా కోసం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్ణయించిన రేటును తాజాగా సవరించింది. శ్రీకాకుళం నుంచి విశాఖ జిల్లాలో లేఅవుట్‌కు ఇసుక సరఫరా చేసినందుకు టన్నుకు రూ.850 వరకు కిరాయి ఇచ్చేవారు. అయితే నగరంలో మూడుచోట్ల ప్రైవేటు ఇసుక యార్డులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం...అక్కడకు సరఫరా నిమిత్తం ఫ్లాట్‌ రేటు ఖరారు చేయడంతో లారీ యజమానులకు టన్నుకు రూ.650 వరకు మాత్రమే దక్కుతుంది. దీనికితోడు మారుమూల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్‌ల వద్దకు ఇసుక సరఫరా చేసేందుకు లారీ యజమానులు ముందుకురావడం లేదు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న లేఅవుట్‌లకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక రీచ్‌ మూసివేత, రాజమండ్రి నుంచి పూర్తిగా ఇసుక అందకపోవడం, రవాణా చార్జీలు తగ్గడం వంటి అంశాల ప్రభావంతో జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు తగినంత ఇసుక రాకపోవడంతో పనుల జోరు తగ్గింది. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ సంస్థ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

Updated Date - Jan 16 , 2025 | 01:28 AM