Share News

షేమ్‌ సీన్‌

ABN , Publish Date - Feb 18 , 2025 | 01:42 AM

నగరంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు తమ అస్మదీయులకు మేలు చేకూర్చేందుకు జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టేందుకు కూడా వెనుకాడడం లేదు.

షేమ్‌ సీన్‌

  • వేమన మందిరం స్థలం స్వాధీనానికి మరోసారి జీవీఎంసీ అధికారుల యత్నం

  • అడ్డుకున్న కూటమి ప్రజా ప్రతినిధులు

  • లీజుకు ఇచ్చి 25 ఏళ్లు దాటినందున మునిసిపల్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకున్నామని వివరించబోయిన జోన్‌-4 సిబ్బంది

  • వినిపించుకోని నేతలు

  • ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి ఒత్తిడి చేయడంతో సీల్‌ తొలగింపు

విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):

నగరంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు తమ అస్మదీయులకు మేలు చేకూర్చేందుకు జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా వేమన మందిరం విషయంలో అధికారులు చర్యలు తీసుకుంటే ముగ్గురు ప్రజా ప్రతినిధులు మోకాలడ్డడం, ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజన కలిగేలా సాక్షాత్తూ జిల్లా ఉన్నతాధికారిపైనే ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

ఆశీల్‌మెట్ట జంక్షన్‌లో తెలుగుతల్లి ఫ్లైఓవర్‌కు ఆనుకుని జీవీఎంసీకి చెందిన స్థలంలో వేమన మందిరం ఉంది. 1980లో వాల్తేరు సర్వే నంబర్‌ 1082లో వేసిన అప్రూవ్డ్‌ లేఅవుట్‌లోని 1,200 చదరపు గజాల రిజర్వు స్థలాన్ని శ్రీవేమన సంక్షేమ సంఘానికి నెలకు రూ.500 చెల్లించేలా పదేళ్ల కాలానికి విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ లీజుకు ఇచ్చింది. ఆ స్థలంలో సంఘం లైబ్రరీ, ఆలయాన్ని నిర్మించింది. 1986లో జీవీఎంసీ నుంచి అనుమతి తీసుకుని శాశ్వత భవనం నిర్మించింది. తర్వాత అంచెలంచెలుగా లీజును పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం జీవీఎంసీకి నెలకు రూ.4,141 చొప్పున లీజు చెల్లిస్తున్నారు. మునిసిపల్‌ చట్టం ప్రకారం ఏదైనా ఆస్తిని ఒకరికి 25 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వడానికి అవకాశం లేకపోవడంతో వేమన మందిరాన్ని అప్పగించాలని జీవీఎంసీ అధికారులు కొన్నేళ్ల కిందట శ్రీవేమన సంక్షేమ సంఘానికి నోటీసు జారీచేశారు. అయినప్పటికీ గత ప్రభుత్వంలోని పెద్దలతో జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయకుండా కాలం గడిపేశారు. వేమన మందిరం లీజు కాలపరిమితి 25 ఏళ్లు దాటిపోయి దశాబ్దం అవుతున్నందున తిరిగి లీజుకు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ గత ప్రభుత్వానికి రెండేళ్ల కిందట లేఖ రాశారు. ఆ లేఖను పట్టించుకోవద్దని మునిసిపల్‌ శాఖ అధికారులను గత ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి లీజు చెల్లింపును కూడా వేమన సంక్షేమ సంఘం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో గతనెల 28న వేమన మందిరాన్ని జోన్‌-4 రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. అయితే జీవీఎంసీ కార్యవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతను వేమన సంక్షేమ సంఘం పెద్దలు కలిసి తిరిగి తమకు అప్పగించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. తమ పార్టీ ఓటమి పాలైపోయినందున కూటమి పెద్దలను కలవాలని ఆయన సలహా ఇచ్చారు. తమకు కూటమి ప్రజా ప్రతినిధులతో పరిచయాలు లేవని చెప్పడంతో సదరు వైసీపీ నేతే తనకు సన్నిహితంగా ఉండే కూటమిలోని ఒక ప్రజా ప్రతినిధికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ఎలాగైనా వేమన మందిరాన్ని తిరిగి వారికే అప్పగించాలని కోరడంతో సదరు ప్రజా ప్రతినిధి జోన్‌-4 అధికారులకు ఫోన్‌ చేసి నోటీసు ఇవ్వకుండా ఎలా సీజ్‌ చేస్తారని నిలదీయడంతోపాటు లీజు బకాయిలు చెల్లించేస్తారు కాబట్టి సీల్‌ తొలగించాలని ఆదేశించారు. జోన్‌-4 అధికారులు చేసేదేమీ లేక సీల్‌ను తొలగించేశారు. తాజాగా వేమన మందిరం లీజుకు ఇచ్చి 25 దాటిపోయింది కాబట్టి, వేలం వేస్తే జీవీఎంసీకి నెలకు కనీసం రూ.రెండు లక్షల ఆదాయం వస్తుందని, ఏపీ మునిసిపల్‌ యాక్ట్‌ ప్రకారం ఆ మందిరాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ జనసేనకు చెందిన ఒక కార్పొరేటర్‌ జీవీఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని, లేనిపక్షంలో తామే సీల్‌ వేసి స్వాధీనం చేసుకుంటామని పేర్కొంటూ జోన్‌-4 అధికారులు నోటీసులు జారీచేశారు. నోటీసులో పేర్కొన్న గడువు శనివారం నాటికి ముగియడంతో సోమవారం ఉదయాన్నే జోన్‌-4 అధికారులు వేమన మందిరానికి సీల్‌ వేసి స్వాధీనం చేసుకున్నారు.

ప్రజా ప్రతినిధుల రంగ ప్రవేశంతో కంగుతిన్న అధికారులు

వేమన మందిరానికి సీల్‌ వేసిన కొద్దిసేపటికే కూటమికి చెందిన ముగ్గురు ప్రజా ప్రతినిధులు ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు జోన్‌-4 అధికారులకు ఫోన్‌ చేసి ‘వేమన మందిరానికి ఎందుకు సీల్‌ వేశారు? తక్షణం తొలగించి నిర్వాహకులకు అప్పగించండి.’ అంటూ హకుం జారీచేయడంతో అధికారులు అవాక్కయ్యారు. లీజు కాలపరిమితి 25 ఏళ్లు దాటి సుమారు దశాబ్దం గడుస్తోందని, గతంలో లీజులో దక్కించుకున్న వ్యక్తి కూడా ప్రస్తుతం జీవించి ఉన్నట్టు సమాచారం లేదని అధికారులు వారికి వివరించారు. మునిసిపల్‌ చట్టం ప్రకారం 25 ఏళ్లకు మించి లీజుకిచ్చే అవకాశం లేదు కాబట్టి తాము చేయగలిగిందేమీ లేదని ప్రజా ప్రతినిధులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ముగ్గురు ప్రజా ప్రతినిధులు నేరుగా ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌కే ఫోన్‌ చేసి ఒత్తిడి చేయడంతో జోన్‌-4 అధికారులు సీల్‌ తొలగించాల్సి వచ్చిందని జీవీఎంసీ అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిత్తశుద్ధితో పనిచేసే వారిని ప్రోత్సహించాల్సిన ప్రజా ప్రతినిధులు...అందుకు విరుద్ధంగా, జీవీఎంసీ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Feb 18 , 2025 | 01:42 AM