శంభో శంకర
ABN , Publish Date - Feb 26 , 2025 | 10:50 PM
హుకుంపేట మండలంలో ప్రముఖ శైవక్షేత్రం మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు బుధవారం భక్తులు పోటెత్తారు.

శివనామ స్మరణతో మార్మోగిన మత్స్యగుండం
పోటెత్తిన భక్తులు
శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ అభిషేక్‌గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్
పాడేరు/హుకుంపేట, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): హుకుంపేట మండలంలో ప్రముఖ శైవక్షేత్రం మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు బుధవారం భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం నుంచే మత్స్యలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని గురువారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, భక్తుల సందర్శన కొనసాగుతున్నది. మన్యం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు మత్స్యగుండం వచ్చి మత్స్యలింగేశ్వరుడ్ని, దేవతలుగా కొలిచే మత్స్యాలను దర్శించుకున్నారు. గుండంలోని మత్స్యాలను దర్శించుకునే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలను కల్పించారు. మత్స్సగుండంలో చేసిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్ పర్యవేక్షించారు. శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పాడేరు డీఎస్‌పీ షేక్ సహబాజ్ అహ్మద్ పర్యవేక్షణలో హుకుంపేట సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం పాడేరు నుంచి మత్స్యగుండానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మత్స్యగుండం సందర్శించే భక్తులు రాత్రంతా అక్కడే జాగరణ చేసి గురువారం తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి మత్స్యలింగేశ్వరుడ్ని దర్శించుకుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మత్స్యగుండం శివరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మినుముల గోపాలపాత్రుడు, ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్యకొండబాబు, మఠం సర్పంచ్ ఎం.శాంతకుమారి, సభ్యులు, అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.