Share News

రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:47 PM

భూ సమస్యలు రెవెన్యూ సదస్సులతో పరిష్కారానికి నోచుకుంటున్నాయని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. పాడేరు మండలం గుత్తులపుట్టులో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం
రెవెన్యూ సదస్సులో ఫిర్యాదులపై అధికారులను అడుగుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): భూ సమస్యలు రెవెన్యూ సదస్సులతో పరిష్కారానికి నోచుకుంటున్నాయని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. పాడేరు మండలం గుత్తులపుట్టులో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించడంతోపాటు రెవెన్యూ పరమైన సేవలను ప్రజల చెంతకు చేర్చాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రజలు తమకున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి, మ్యుటేషన్‌కు, వివిధ ధ్రువ పత్రాల జారీకి ప్రజలు ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గిరిజన ప్రాంతంలోని భూ సమస్యలను సబ్‌కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, అక్కడా న్యాయం జరగలేదని భావిస్తే ఐటీడీఏ పీవోకు అప్పీల్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదుల వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ పి.పోలురాజు, స్థానిక సర్పంచ్‌ బాబూరావు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:47 PM