భూ ఆధార్‌కు సర్వర్ కష్టాలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:20 AM
సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల భూ ఆధార్ (ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ నెల 10వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభంకాగా ఇప్పటికి 50 శాతం నమోదు కూడా పూర్తికాలేదు. ఈ నెల 27వ తేదీతో గడువు ముగియనుండడం, సర్వర్ సక్రమంగా పని చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నెల 27 వరకే గడువు
రైతు సేవా కేంద్రాలకు క్యూ కడుతున్న రైతులు
సర్వర్ పని చేయక ఇబ్బందులు
ఓటీపీలు రాకపోవడంతో రైతులను వెనక్కి పంపుతున్న సిబ్బంది
నర్సీపట్నం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల భూ ఆధార్ (ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ నెల 10వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభంకాగా ఇప్పటికి 50 శాతం నమోదు కూడా పూర్తికాలేదు. ఈ నెల 27వ తేదీతో గడువు ముగియనుండడం, సర్వర్ సక్రమంగా పని చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయ భూమి ఉన్న ప్రతీ రైతు ఆధార్ కార్డు, ఆధార్‌కి అనుసంధానం చేసిన ఫోన్ నంబరు, పట్టాదార్ పాసు పుస్తకం వివరాలతో రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్లి భూ ఆధార్(ఫార్మర్ రిజిస్ట్రీ)లో పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రజలందరి ఆధార్, విద్యార్థులకు ఆపార్ గుర్తింపు కార్డులు ఇస్తున్నట్టే రైతులందరికీ 11 అంకెలతో గుర్తింపు కార్డు ఇస్తారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఈ నెల 27తో గడువు ముగుస్తుంది. డివిజన్‌లో 73,449 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 26,630 మంది రైతులు నమోదు చేసుకున్నారు. పీఎం కిసాన్, వ్యవసాయ పెట్టుబడి సాయం, యంత్ర సామగ్రి పంపిణీ, పంటల బీమా పథకాలు మంజూరు కావాలంటే తప్పనిసరిగా భూ ఆధార్‌లో రైతులు వివరాలు నమోదు చేసుకోవాలి. బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసిన నంబరు ఉన్న సెల్‌ఫోన్‌ను రైతులు వెంట తీసుకు వెళితే మూడు ఓటీపీలు వస్తాయి. మూడు ఓటీపీలు భూ ఆధార్‌లో నమోదు చేస్తేనే ప్రక్రియ పూర్తవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు సర్వర్ పని చేయక పోవడంతో చాలా చోట్ల రైతు సేవా కేంద్రాలలో ఓటీపీలు నమోదు పూర్తి కాలేదు. మధ్యాహ్నం 3 గంటలు తరువాత రావాలని రైతులను వెనక్కి పంపించారు. పెదబొడ్డేపల్లి ఏఎంసీ ఆవరణలో ఉన్న రైతు సేవా కేంద్రంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రక్రియ చేపడితే, మధ్యాహ్నం 1 గంటకి కేవలం 20 మందికి మాత్రమే నమోదు చేశారు. ఓటీపీలు అవ్వక మళ్లీ రావాలని రైతులను వెనక్కి పంపేశారు.
ఐదు రోజులే గడువు
ఈ నెల 10 నుంచి ప్రక్రియ మొదలు పెడితే ఇప్పటికి 50 శాతం నమోదు కూడా పూర్తి కాలేదు. డి.పట్టా భూములు, ఆర్‌వోఎఫ్‌ఆర్ భూముల వివరాలు ఓపెన్ కావడం లేదు. నర్సీపట్నం సబ్ డివిజన్‌లో నర్సీపట్నం మండలంలో 9,053 మంది రైతులు ఉంటే, 4,045 మంది నమోదు చేసుకున్నారు. రోలుగుంట మండలంలో 17,587 మంది రైతులకు 5,356, గొలుగొండలో 7,925 మందికి 3,922 రైతులకు, రావికమతంలో 26,160 మందికి 7,268, వి.మాడుగుల మండలంలో 12,742 మందికి 6,040 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈలోగా రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వ్యవసాయ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.