నత్తనడకన సైన్స్ మ్యూజియం పనులు
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:42 AM
కైలాసగిరిపై అడ్వాన్స్‌డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం నిర్మాణం నత్తనడకన సాగుతోంది.

ఏడాది కిందట శంకుస్థాపన
సంవత్సరంలో అందుబాటులోకి తీసుకువస్తామని అప్పట్లో ప్రకటనలు
కనీసం సగం కూడా పూర్తికాని వైనం
విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
కైలాసగిరిపై అడ్వాన్స్‌డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గత ఏడాది జనవరి రెండో తేదీన మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏడాదిలో పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తామని నాటి ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. అందులో రూ.4.69 కోట్లు కేంద్ర నిధులు కాగా సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ రూ.93.80 లక్షలు సమకూర్చడానికి ముందుకువచ్చింది. మ్యూజియంలో 3డీ ఆర్ట్ గ్యాలరీ, సిలికాన్ మ్యూజియం, సోలార్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఉంటాయని శంకుస్థాపన సమయంలో వీఎంఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు. నిర్మాణ బాధ్యతలను ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థ చేపట్టింది. అయితే పర్యవేక్షణ లోపం వల్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. కనీసం సగం కూడా పూర్తి కాలేదు. ఇందులో వీఎంఆర్‌డీఏ పాత్ర ఏమీ లేదని, వారు కోరినంత భూమి మాత్రమే ఇచ్చామని అధికార వర్గాలు తెలిపాయి.