Share News

సైన్స్‌ ఫెయిర్లతో సృజనాత్మకతకు పదును

ABN , Publish Date - Jan 04 , 2025 | 10:34 PM

విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పదును పెట్టేందుకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.

సైన్స్‌ ఫెయిర్లతో సృజనాత్మకతకు పదును
ప్రాజెక్టును తిలకిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన ఎంపీ తనుజారాణి

జిల్లా స్థాయి సైన్సు ఫెయిర్‌ను ప్రారంభించిన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

పాల్గొన్న ఎంపీ డాక్టర్‌ తనుజారాణి

పాడేరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పదును పెట్టేందుకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. శనివారం స్థానిక అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను అరకులోయ ఎంపీ డాక్టర్‌ జి.తనుజారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకు ఒకసారి పాఠశాలల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే విద్యార్థులు పర్యావరణం, గ్లోబల్‌ వార్మింగ్‌, వరద హెచ్చరికలు, నీటి సుద్దీకరణ, వ్యర్ధాల నిర్వహణపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారని అభినందించారు. అలాగే అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌పై ఏర్పాటుచేసిన ప్రదర్శన అద్భుతంగా ఉందని విద్యార్థులను కలెక్టర్‌ అభినందించారు. అరకులోయ ఎంపీ డాక్టర్‌ జి.తనుజారాణి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ఇటువంటి ప్రదర్శనలు మరిన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. అలాగే గిరిజన విద్యార్థులు అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. క్రీడా రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే విద్యార్థుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అందుకు ముందుగా అబ్దుల్‌కలాం, సర్‌ సీవీరామన్‌, సర్‌ అలెగ్జాండర్‌ ప్లెమింగ్‌ చిత్రపటాలకు పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ప్రాజెక్టులను తిలకించారు. అలాగే గత డిసెంబరు 30న విజయవాడలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఎంపీ తనుజారాణి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో పి.బ్రహ్మాజీరావు, పాఠశాల హెచ్‌ఎం టి.నాగేశ్వరరావు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 10:34 PM