సముద్ర తీరంలో ఇసుక దోపిడీ
ABN , Publish Date - Jan 17 , 2025 | 02:08 AM
మండలంలోని పలు గ్రామాల వద్ద సముద్ర తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి.

రాంబిల్లి మండలంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
అలలకు చేరువలో భారీ గోతులు
పట్టించుకోని అటవీ శాఖ అధికారులు
రాంబిల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని పలు గ్రామాల వద్ద సముద్ర తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రధాన రహదారి నుంచి సముద్ర తీరం వరకు ట్రాక్టర్లు వెళ్లడానికి బాటలను ఏర్పాటు చేసుకున్నారు. వాహనాలు ఇసుకలో కూరుకుపోకుండా వుండడానికి బాటల్లో అరటి, కొబ్బరి ఆకులు వేస్తున్నారు. ఈ గ్రామాల వద్ద తరచూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
రాంబిల్లి మండలం వాడపాలెం, కొత్తపట్నం, సీతపాలెం గ్రామాల వద్ద సముద్రతీరం వెంబడి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా అక్రమార్కులు ఇసుకను తవ్వి, ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. వాస్తవంగా సముద్రం ఇసుకను ఇళ్ల నిర్మాణాలకు వినియోగించరు. అయితే ఇళ్ల నిర్మాణంలో పునాదులు నింపడానికి, లేఅవుట్లు, ఇతర ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి మట్టి, గ్రావెల్ బదులు సముద్రం ఇసుకను వినియోగిస్తున్నారు. ఇందుకోసం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలను తవ్వేస్తూ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుక రూ.3,500 నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. అటవీ శాఖ పరిధిలోని సముద్ర తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నప్పటికీ ఆ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినా చూడడంలేదు. అటవీ శాఖతోపాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కూడా వెంటనే స్పందించి సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలను కట్టడి చేయాలని, లేకపోతే తుఫాన్లు సంభవించినప్పుడు సముద్రం నీరు గ్రామాలను ముంచెత్తే ప్రమాదం వుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.