ఎస్సీ హాస్టళ్లకు మోక్షం
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:51 AM
సాంఘిక సంక్షేమ వసతిగృహాల రూపురేఖలు మారనున్నాయి. శిఽథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేయించి ఇతర సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో పది వసతిగాహాలను అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరయ్యాయి. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఇప్పటికే మరమ్మతు పనులు ప్రారంభించారు.

విద్యార్థుల వసతిగృహాలకు మరమ్మతులు
జిల్లాలో పది హాస్టళ్లకు రూ.2 కోట్లు మంజూరు
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఇప్పటికే పనులు ప్రారంభం
వేసవిలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు
తొలగనున్న విద్యార్థుల కష్టాలు
చోడవరం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ వసతిగృహాల రూపురేఖలు మారనున్నాయి. శిఽథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేయించి ఇతర సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో పది వసతిగాహాలను అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరయ్యాయి. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఇప్పటికే మరమ్మతు పనులు ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలు చాలా ఏళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. హాస్టళ్లలో సౌకర్యాల లేమితో విద్యార్థులు అవస్థలు పడుతూ వస్తున్నారు. వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, కనీస సౌకర్యాలు మెరుగుపరచాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసినా.. గత వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో వర్షం పడితే కారిపోయే శ్లాబ్, దుర్గంధం వెదజల్లే మరుగుదొడ్లు, గదుల్లో అడ్డదిడ్డంగా వేలాడే విద్యుత్ వైర్లు, వెలగని దీపాలు, విరిగిపోయిన కిటికీలు, తలుపులతో అత్యంత దయనీయంగా వున్న ఎస్‌సీ విద్యార్థుల హాస్టల్ భవనాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. చోడవరం పట్టణంలోని బాలుర హస్టల్ , బాలికల హాస్టల్, బుచ్చెయ్యపేట మండలంలో బాలుర వసతిగృహం, కె.కోటపాడులో బాలికల హాస్టల్, కశింకోటలో బాలికల హాస్టల్, అనకాపల్లిలో బాలురు హాస్టల్, పరవాడలో బాలికల హాస్టల్, అచ్యుతాపురంలో బాలుర హాస్టల్, ఎ.కోడూరులో బాలుర హాస్టల్ భవనాలను అభివృద్ధి చేయనున్నారు. వసతిగృహంలో గుర్తించిన సమస్యల మేర అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో హాస్టల్‌కు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరక ప్రభుత్వం కేటాయించింది. పది వసతిగృహాలకు కలిపి సుమారు రూ.2 కోట్లు మంజూరైనట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వర్షం పడితే కారిపోతున్న భవనాల శ్లాబ్‌లను పూర్తిగా తొలగించి, కొత్త శ్లాబ్‌లు వేస్తున్నారు. ఇంకా ఫ్లోరింగ్, విద్యుత్ వైరింగ్, మరుగుదొడ్లకు మరమ్మతులు, తాగునీటి వనరుల అభివృద్ధి, పెయింటింగ్ వంటి పనులు చేపడతారు. హాస్టల్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతారు.
ప్రస్తుతం వసతిగృహాల్లో చేపట్టిన పనులు వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి భవనాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చోడవరంలోని గాంధీగ్రామంబాలుర వసతిగృహం, చీడికాడ రోడ్డులోని బాలికల వసతిగృహం మరమ్మతు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
వేసవి సెలవుల్లో పనులు పూర్తి
బి.ఈశ్వరరావు, జిల్లా సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి
సాంఘిక సంక్షేమ శాఖ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ విద్యార్థుల వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొన్నిచోట్ల ఇప్పటికే పనులు మొదలయ్యాయి. విద్యార్థులు ఇబ్బంది పడకుండా వేసవి సెలవుల్లో పనులు చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.