బే వాచ్‌లో నిబంధనలు బేఖాతరు
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:06 AM
వైసీపీ నాయకుల దోపిడీపై కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేపట్టి చర్యలు చేపడుతున్నారు.

అన్నీ అడ్డగోలు వ్యవహారాలే
బీచ్‌లో 40 సెంట్ల స్థలం ఆక్రమణ
వెదురు కట్టడాలను కూల్చి పక్కా నిర్మాణాలు
మహిళల రెస్ట్‌రూమ్ పడగొట్టి కేఫ్‌టేరియా
అధిక ధరకు మద్యం అమ్మకం
నివేదిక సమర్పించినా పట్టించుకోని ప్రభుత్వం
లీజుదారుడి నుంచి చేతులు మారిందనే విషయం నివేదికలో పొందుపరచని అధికారులు
వైసీపీ నాయకుల సబ్ లీజులో పర్యాటక ఆస్తి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వైసీపీ నాయకుల దోపిడీపై కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేపట్టి చర్యలు చేపడుతున్నారు. కానీ, విశాఖపట్నంలో మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాపులుప్పాడలో పర్యాటక సంస్థకు చెందిన ‘బే వాచ్’ చేతులు మారినా పట్టించుకోకపోవడమే అందుకు నిదర్శనం. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఒకరికి దానిని లీజుకు ఇస్తే వారి నుంచి వైసీపీ నాయకులు సబ్ లీజుకు తీసుకొని గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. రూపురేఖలు మార్చేశారు. నిబంధనలు ఉల్లంఘించారు. బీచ్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమించారు. అవన్నీ విచారణలో ఐదు నెలల క్రితమే బయటపడినా వారిపై ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు లేవు. ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉన్నారో అర్థం కాని అంశం.
భీమిలి మండలం కాపులుప్పాడలో తొట్లకొండ ఎదురుగా బీచ్‌లో సర్వే నంబరు 314/పిలో 2.16 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక శాఖ నిర్మించిన బీచ్ ఫ్రంట్ అండ్ షాక్స్-బే వాచ్‌ను 2017 ఆగస్టులో డీవీవీఎల్‌ఎన్ మూర్తికి ఏపీటీడీసీ లీజుకు ఇచ్చింది. ఆ ప్రాంతం కోస్తా నియంత్రణ మండలి-3లో ఉంది. శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే దానిని వైసీపీ అధికారంలోకి వచ్చాక ముగ్గురు నేతలు కలిసి సబ్ లీజుకు తీసుకున్నారు. అది చేతులు మారిన తరువాత వెనుకనున్న బీచ్‌లో 40 సెంట్ల భూమి ఆక్రమించారు. కాంక్రీట్‌తో సకల సౌకర్యాలతో ఎనిమిది గదులు నిర్మించారు. వాటిని రోజుకు రూ.2 వేలకు అద్దెకు ఇస్తున్నారు. మహిళల రెస్ట్‌రూమ్‌లకు ఉద్దేశించిన నిర్మాణాలను కూలగొట్టి కేఫ్‌టేరియా నిర్మించారు. ఒక గుడిసె స్థానంలో బార్ ఏర్పాటు చేశారు. అక్కడ మద్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారు. వీటిపై జనసేన నాయకులు పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. గత ఏడాది సెప్టెంబరులో జిల్లా పర్యాటక శాఖ అధికారిని జ్ఞానవేణి బే వాచ్‌కు వెళ్లి విచారణ చేశారు. ఫిర్యాదీ మూర్తి యాదవ్‌ను, రెస్టారెంట్ మేనేజర్‌ను, లీజుకు తీసుకున్న మూర్తిని పిలిచి మాట్లాడారు. మొత్తం అంతా చూసి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా కొత్త నిర్మాణాలు చేపట్టినట్టు నిర్ధారించారు. మండల సర్వేయర్‌తో సర్వే చేయించి 40 సెంట్లు బీచ్‌ను వెనుక ఆక్రమించి, దానిని ఉపయోగించుకున్నట్టు తేల్చారు. అనధికారంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించినట్టు గుర్తించారు. అలాగే పార్కింగ్ ఏరియాలో బాక్స్ క్రికెట్ నిర్వహిస్తున్నట్టు నివేదికలో పొందుపరచారు. సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేల్చారు. లీజు ఒప్పందానికి వ్యతిరేకంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టిన విషయం నిర్ధారించారు. లిక్కర్‌ను ప్రభుత్వం సూచించిన ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నట్టు, లెక్కల్లో తేడాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే ఎనిమిది గదులు నిర్మించి వాటిని పర్యాటకులకు అద్దెకు ఇస్తుండగా, వాటికి సంబంధించిన రికార్డుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు. విజిటర్స్ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, అందులో వివరాలు నమోదు చేయకపోవడం గుర్తించారు. విశాఖపట్నానికి పర్యాటక సీజన్ నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. కానీ అక్కడ ఆ నెలల్లో కూడా రూమ్‌లు కేవలం 20 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్టు చూపించడంపై విచారణ అధికారి అనుమానం వ్యక్తంచేశారు. దీనిపై ఏపీటీడీసీ దృష్టి పెట్టాలని, దేశీ, విదేశీ పర్యాటకుల వివరాలు పక్కాగా నిర్వహించేలా చూడాలని సూచించారు.
సబ్ లీజ్ విషయం దాటవేత
అయితే కారణమేమిటో గానీ ఈ బే వాచ్‌ని వారు సబ్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నట్టు నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్తవానికి విజయవాడలోని ఏపీటీడీసీ అధికారులు దీనికి సంబంధించిన అంశాలపై వైసీపీ నాయకులకే నేరుగా మెయిల్స్ పంపి ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. కానీ విచారణాధికారి ఆ విషయం తొక్కిపెట్టారు. నిబంధనలు ఉల్లంఘించారని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నివేదిక జిల్లా అధికారులకు చేరి సుమారు నాలుగు నెలలు పూర్తయింది. సబ్ లీజ్ రద్దు విషయం గానీ, భూ ఆక్రమణ తొలగింపు గానీ, మద్యం అధిక ధరల విక్రయంపై గానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంది
పీతల మూర్తి యాదవ్ భీమిలి బీచ్‌లో సాయిరెడ్డి నిర్మాణంతో పాటు నాలుగు రెస్టారెంట్ల అక్రమ నిర్మాణాలపై కూడా ఫిర్యాదు చేశారు. వాటిపై కూడా విచారణ చేసి జిల్లా అధికారులు ఈ నెల 26వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు రెండు రోజుల క్రితం ఆదేశించింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు బే వాచ్ అక్రమాలపై చర్యలు చేపడతారా? లేదా అనేది చూడాలి.