Share News

రహదారుల నిర్మాణంపై కసరత్తు

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:52 AM

విశాఖ జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్‌, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ‘సెల్ఫ్‌ సస్టెయినబుల్‌’ రహదారుల నిర్మాణానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక సిద్ధం చేసింది.

రహదారుల నిర్మాణంపై కసరత్తు

‘సెల్ఫ్‌ సస్టెయినబుల్‌ మోడల్‌’లో చేపట్టాలని భావిస్తున్న వీఎంఆర్‌డీఏ

వెచ్చించిన మొత్తం తిరిగి ఆదాయం రూపంలో వెనక్కి తెచ్చుకునేలా ప్రణాళికలు

ఆర్‌డీపీ తయారయ్యాకే పనులు

ఆచరణకు ప్రత్యేకంగా హైపవర్‌ కమిటీ నియామకం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్‌, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ‘సెల్ఫ్‌ సస్టెయినబుల్‌’ రహదారుల నిర్మాణానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యంగా ఇంకో 18 నెలల కాలంలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్నందున జిల్లా నలుమూలల నుంచి అక్కడకు త్వరగా చేరుకోవడానికి జీవీఎంసీతో కలిసి 15 రహదారుల నిర్మాణానికి నిర్ణయించింది. జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గించడమే వీటి నిర్మాణంలో ప్రధాన ఉద్దేశం. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిని కలుపుతూ కొన్ని, భీమిలి బీచ్‌ను కలుపుతూ కొన్ని, ఎన్‌ఏడీ నుంచే దారిమళ్లించేలా మరికొన్ని రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.

పెందుర్తి, ఆనందపురం, భీమిలి, డెంకాడ, విజయనగరం తదితర ప్రాంతాలను కలుపుతూ విస్తరించే ఈ 15 రహదారులకు రూ.403.67 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఒక్కో రహదారి నిర్మాణానికి సగటున రూ.25 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇటు వీఎంఆర్‌డీఏ వద్ద గానీ, అటు జీవీఎంసీ దగ్గర గానీ అన్ని నిధులు లేవు. దాంతో రహదారులకు వెచ్చించిన మొత్తం తిరిగి ఆదాయం రూపంలో వెనక్కి తెచ్చుకునేలా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. టోల్‌ గేట్‌ పెడితే సరిపోతుందా?, ఇంకా ఇతర ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా?, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఆర్థిక భారం పడకుండా చూడడం ఎలా?...అనే దానిపై కసరత్తు ప్రారంభించారు. దీనికోసం ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించారు. హైదరాబాద్‌లో అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టులో పనిచేసి రిటైరైన డీటీసీపీని, రాష్ట్ర డీటీసీపీని, వీఎంఆర్‌డీఏ సీయూపీ, ఏయూకు చెందిన ప్రొఫెసర్‌, స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నుంచి ఒకరిని కలిపి హై పవర్‌ కమిటీ వేశారు. వీరంతా కలిసి రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఆర్‌డీపీ) తయారుచేస్తారు. అందులోనే నిర్మాణ వ్యయం, దానిపై ఏయే మార్గాల్లో ఎంతెంత ఆదాయం వస్తుందో ఒక అంచనా రూపొందిస్తారు. తొలుత అత్యంత ప్రధానమైన రహదారిని నిర్మిస్తారు. దానిపై వచ్చే ఆదాయం చూసి, బాగుందంటే...ఆ తరహాలో మరో రహదారి నిర్మాణం చేపడతారు. ఇలా ఒకదాని తరువాత మరొకటి నిర్మాణం చేసుకుంటూ వెళతారు.

నేడు హైవపర్‌ కమిటీ సమావేశం

విశ్వనాథన్‌, కమిషనర్‌, వీఎంఆర్‌డీఏ

భోగాపురం కనెక్టివిటీ కోసం నిర్మించే రహదారులను ‘సెల్ఫ్‌ సస్టెయినబుల్‌’ మోడల్‌లో నిర్మించడానికి హై పవర్‌ కమిటీ వేశాం. ఇంతకు ముందు ప్రాథమికంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వీఎంఆర్‌డీఏలోనే శుక్రవారం మరో సమావేశం నిర్వహిస్తున్నాం. ఇందులో ఆదాయ వనరులు ఎలా?...అనే అంశంపై చర్చించి అందరి ఆలోచనలతో ఒక ఆర్‌డీపీ తయారు చేస్తాం. దానిని అమలు చేసి, విజయవంతం అయితే అదే తరహాలో మిగిలిన రహదారుల నిర్మాణం చేపడతాము.

Updated Date - Jan 17 , 2025 | 01:52 AM