Share News

స్కూల్‌ కాంప్లెక్స్‌లు పునర్వ్యవస్థీకరణ

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:30 AM

పాఠశాల విద్యా శాఖ పరిధిలో గల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు స్కూల్‌ కాంప్లెక్స్‌లను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్కూల్‌ కాంప్లెక్స్‌లు పునర్వ్యవస్థీకరణ

జిల్లాలో 54 స్కూల్‌ కాంప్లెక్స్‌లు

ఒక్కో కాంప్లెక్స్‌ పరిధిలో 800-1,000 విద్యార్థులు, 40-50 ఉపాధ్యాయులు ఉండేలా కసరత్తు

కాంప్లెక్స్‌ కేంద్రమైన ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకు పర్యవేక్షణ బాధ్యతలు

బోధనేతర సిబ్బంది లేనిచోట్ల ఇబ్బందులు

విశాఖపట్నం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):

పాఠశాల విద్యా శాఖ పరిధిలో గల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు స్కూల్‌ కాంప్లెక్స్‌లను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై పాఠశాలలు, ఉపాధ్యాయులపై అజమాయిషీ బాధ్యతను సంబంధిత కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

విశాఖ జిల్లాలో ఇప్పటివరకూ గల 51 స్కూల్‌ కాంప్లెక్స్‌లకు అదనంగా మరో మూడు మంజూరుచేసింది. దీంతో కాంప్లెక్స్‌ల సంఖ్య 54కు చేరింది. వీటిలో కేటగిరీ-ఎ కింద 51, కేటగిరీ-బి కింద మూడింటిని గుర్తించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులు స్కూల్‌ కాంప్లెక్స్‌ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు గ్రామీణ ప్రాంతంలో 10 నుంచి 15, నగర పరిధిలో ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఒక స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోకి తీసుకువస్తారు. స్కూల్‌ కాంప్లెక్స్‌గా గుర్తించే ఉన్నత పాఠశాల మధ్యలో అంటే దాని పరిధిలో ఉన్న పాఠశాలలకు అందుబాటులో ఉండాలి. ఒక స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులు, 800 నుంచి 1,000 మంది విద్యార్థులు ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఒక పంచాయతీ పరిధిలో ఉన్న పాఠశాలలన్నింటినీ ఒక స్కూల్‌ కాంప్లెక్స్‌ కిందకు తీసుకురావాలి తప్ప రెండుగా విభజించకూడదని పాఠశాల విద్యా శాఖ స్పష్టంచేసింది. గతంలో యూపీ పాఠశాలలను స్కూల్‌ కాంప్లెక్స్‌ కేంద్రాలుగా గుర్తించగా ఇప్పుడు వాటిని రద్దు చేశారు.

స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు పలు బాధ్యతలు అప్పగించనున్నారు. తన పరిధిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పర్యవేక్షణను ఆయనే చూడాలి. టీచర్ల పనితీరు, జీతాలు డ్రా చేయడం, సెలవులు మంజూరుచేయడం, ఇతర పాలనాపరమైన బాధ్యతలు చూడాల్సింది కూడా కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలే. తన పాఠశాలతోపాటు కాంప్లెక్స్‌ పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ చూడాలి. అయితే...జిల్లాలో కాంప్లెక్స్‌లుగా గుర్తించిన పలు ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది లేరు. అటువంటప్పుడు స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో సుమారు 40 నుంచి 50 మంది టీచర్ల బిల్లులు, ఇతర అంశాలు, పరీక్షల నిర్వహణకు సంబంధించి వ్యవహారాలు చూసుకోవడం హెచ్‌ఎం ఒక్కరి వల్ల కాదని సీనియర్‌ హెచ్‌ఎం ఒకరు వ్యాఖ్యానించారు. స్కూల్‌ కాంప్లెక్స్‌లలో ఉన్న సీఆర్పీలకు సమగ్రశిక్షా అభియాన్‌ అనేక పనులు అప్పగిస్తోంది. మండల విద్యా శాఖ కార్యాలయంలో పనులను ఉపాధ్యాయులే చేస్తున్నట్టు భవిష్యత్తులో స్కూలు కాంప్లెక్స్‌లో గుమస్తా పనులను టీచర్లకు అప్పగించే అవకాశం ఉందని మరో టీచరు అభిప్రాయపడ్డారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఏ విధానం అమలుచేసినా ఇబ్బందిలేదని, అందుకు తగిన విధంగా వ్యవస్థను ఏర్పాటుచేయాలని కోరారు. ఇప్పటివరకూ తూతూమంత్రంగా ఉన్న స్కూల్‌ కాంప్లెక్స్‌లను బలోపేతం చేయాలన్న ఆలోచనకు అనుగుణంగా అన్ని వనరులు సమకూర్చాలని సూచించారు.

Updated Date - Jan 16 , 2025 | 01:30 AM