Share News

రోడ్లపై ఆక్రమణలు తొలగింపు

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:45 AM

నగరంలో రోడ్లపై ఆక్రమణలను తొలగించేందుకు ఇకపై పూర్ణామార్కెట్‌ తరహా మోడల్‌ను కొనసాగిస్తామని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి అన్నారు.

రోడ్లపై ఆక్రమణలు తొలగింపు

  • నగరమంతా పూర్ణామార్కెట్‌ మోడల్‌

  • స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తాం

  • జీవీఎంసీ, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటాం

  • ప్రత్యామ్నాయంగా వ్యాపారులకు హాకర్‌ జోన్లు ఏర్పాటుకు చర్యలు

  • పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి

విశాఖపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి):

నగరంలో రోడ్లపై ఆక్రమణలను తొలగించేందుకు ఇకపై పూర్ణామార్కెట్‌ తరహా మోడల్‌ను కొనసాగిస్తామని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి అన్నారు. పూర్ణామార్కెట్‌ ప్రధాన రహదారితోపాటు చుట్టుపక్కల రోడ్లపై ఆక్రమణలను జీవీఎంసీ అధికారులు, సిబ్బంది సహకారంతో వన్‌టౌన్‌ పోలీసులు రెండు రోజుల క్రితం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి, వ్యాపారులు, కొనుగోలుదారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సీపీ శంఖబ్రతబాగ్చి గురువారం స్వయంగా పూర్ణామార్కెట్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో విశాలంగా మారిన రహదారులపై కేటాయించిన ప్రాంతంలో కొనుగోలుదారులు వాహనాలను పార్కింగ్‌ చేసుకుంటుండడం చూసి సీపీ సంతోషం వ్యక్తంచేశారు. ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారులతోపాటు మార్కెట్‌కు వచ్చిన వినియోగదారులతో మార్కెట్‌ వద్ద గతంలో ఉన్న పరిస్థితి, ప్రస్తుతం పరిస్థితిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పూర్ణామార్కెట్‌ రోడ్డులో ఆక్రమణల కారణంగా ట్రాఫిక్‌ సమస్యతోపాటు వాహనంపై వస్తే ఎక్కడ పార్కింగ్‌ చేయాలో తెలియని పరిస్థితి ఉండేదని, దీనిపై జీవీఎంసీ, పోలీస్‌ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినాసరే ఫలితం లేకపోయిందని, ఇప్పుడు ఆక్రమణలను తొలగించడంతో అన్నివిధాలుగా సౌకర్యంగా ఉందని సీనియర్‌ సిటిజన్‌ ఒకరు సీపీకి వివరించారు. ఈ నేపథ్యంలో నగరంలో రోడ్ల ఆక్రమణల కారణంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాలను గుర్తించి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు స్పెషల్‌డ్రైవ్‌ కొనసాగిస్తామని సీపీ వివరించారు. ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామన్నారు. అందుకు జీవీఎంసీతోపాటు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటామన్నారు. వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా చూపించేందుకు నగరంలో హాకర్‌జోన్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:45 AM