Share News

అన్నదాతలకు ఊరట

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:08 AM

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌కు దరఖాస్తు చేసి, నెలల తరబడి ఎదురుచూస్తున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెండింగ్‌లో వున్న దరఖాస్తులకు ప్రాధాన్యతా క్రమంలో విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

అన్నదాతలకు ఊరట
విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చిన వ్యవసాయ బోరు

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన ్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

నెలల తరబడి ఎదురు చేస్తున్న రైతులకు తీపికబురు

దరఖాస్తుల ప్రాధాన్యతా క్రమంలో కనెక్షన్లు బిగింపు

గత జూలై వరకు దరఖాస్తులు క్లియర్‌

చోడవరం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌కు దరఖాస్తు చేసి, నెలల తరబడి ఎదురుచూస్తున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెండింగ్‌లో వున్న దరఖాస్తులకు ప్రాధాన్యతా క్రమంలో విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

సాగునీటి వనరులు లేని ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకోవాలంటే వర్షంపైనే ఆధారపడాలి. ఇటువంటిచోట్ల బోర్లు వేసుకుని, విద్యుత్‌ మోటార్లను బిగించుకుంటే ఏటా రెండు పంటలు పండించుకునే అవకాశం వుంటుంది. దీంతో పలువురు రైతులు ఖర్చుకు వెనుకాడకుండా బోర్లు వేయించుకుంటున్నారు. అయితే విద్యుత్‌ కనెక్షన్‌ వుంటే తప్ప బోర్లును వినియోగించుకోలేరు. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేస్తే.. నెలల తరబడి వేచి వుండాల్సి వస్తున్నది. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఉచితంగా కరెంటు ఇస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు కూడా తమ భూముల్లో బోర్లు వేయించుకుంటున్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తున్నాయి. స్థానిక సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్నిబట్టి ఈపీడీసీఎల్‌ అధికారులు ప్రాధాన్యతా క్రమంలో వ్యవసాయ బోర్లుకు విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తున్నారు.

ఇదిలావుండగా జిల్లాలో చాలా కాలం నుంచి వ్యవసాయ రంగానికి కొత్త విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు కాలేదు. విద్యుత్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు భారీగా పేరుకుపోయాయి. విద్యుత్‌ కనెక్షన్ల కోసం రైతులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మాదిరిగా ఈపీడీసీఎల్‌ కాల్‌సెంటర్‌ లేదా మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే వీలు కల్పించింది. దళారుల ప్రమేయం లేకుండా రైతులు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసి వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ పొందేలా రూపకల్పన చేశారు. కనెక్షన్‌ మంజూరైన రైతులు ఈపీడీసీఎల్‌ సూచించిన రుసుము చెల్లించిన తరువాత, విద్యుత్‌ సిబ్బంది సంబంధిత రైతు పొలంలో మోటారుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేలా మార్పులు తెచ్చారు. ఇంతవరకు బాగానే వున్నప్పటికీ కొత్త విధానంలో దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు కాకపోవడంతో అసంతృప్తి చెందుతున్నారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ ఎప్పుడు ఇస్తారంటూ ఈపీడీసీఎల్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 150 మంది రైతులు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిసింది. జిల్లాలోని ఇతర ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నెలకొన్న ఈ పరిస్థితి ప్రభుత్వం దృష్టికి రావడంతో పాలకులు స్పందించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రాధాన్యతాక్రమంలో విడతల వారీగా విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని ఈపీడీసీఎల్‌ అధికారులను ఆదేశించింది. దీంతో కొద్ది రోజుల నుంచి విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తున్నారు.

దశలవారీగా విద్యుత్‌ కనెక్షన్లు

ఎ.రామకృష్ణ, ఈపీడీసీఎల్‌ డీఈ, నర్సీపట్నం.

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరుకు ప్రభుత్వం విడతల వారీగా అనుమతి ఇస్తున్నది. గత ఏడాది డిసెంబరులో తొలివిడత కోటా మంజూరుకాగా, ఏప్రిల్‌లోపు దరఖాస్తు చేసిన వారికి విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. రెండో విడత కోటా కింద ఈ నెలలో 70 కనెక్షన్లు మంజూరుకాగా వాటిని జూలై 25వ తేదీలోగా దరఖాస్తు చేసిన రైతులకు మంజూరు చేశాం. మా శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే మిగిలిన రైతులకు కూడా కనెక్షన్లు ఇస్తాం.

Updated Date - Jan 18 , 2025 | 12:08 AM