Share News

జిల్లాలోని 21 ఆలయాల పునర్‌ వర్గీకరణ

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:30 AM

జిల్లాలోని దేవాలయాలను పునర్‌ వర్గీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాలోని 21 ఆలయాల పునర్‌ వర్గీకరణ
చోడవరంలోని విఘ్నేశ్వరస్వామి ఆలయం

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అనకాపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని దేవాలయాలను పునర్‌ వర్గీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న 21 దేవాలయాలను వర్గీకరణ చేశారు. జీవో ప్రకారం జిల్లాలో చోడవరం శ్రీవిఘ్నేశ్వరస్వామి ఆలయం, నర్సీపట్నంలోని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయాలు గతంలో 6(ఎ)(2) ఉండగా, వర్గీకరణ నేపథ్యంలో 6(బి)(2)గా మార్పు చేశారు. ఆలయాల పరిఽధిలోని సత్రాలను ఎలమంచిలి, చోడవరం సత్రాలను 6(బి) నుంచి 6(సి)గా వర్గీకరించారు. దీంతో పాటు అనకాపల్లిలో భోగలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీజనార్దన స్వామి ఆలయం, శ్రీసంతోషిమాత అమ్మవారి ఆలయం, శ్రీసత్యనారాయణస్వామి ఆలయం, సబ్బవరం మండలం సోమనాథపురంలోని శ్రీసోమలింగేశ్వర ఆలయం, చోడవరం గౌరీశ్వరస్వామివారి ఆలయం, బుచ్చెయ్యపేట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, నర్సీపట్నం మండలం బలిఘట్టంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయం, బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం, అచ్యుతాపురం మండలం దోసూరులో శ్రీబ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం, రావిపాలెంలోని కోదండరామస్వామి ఆలయం, నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టలోని శ్రీలక్ష్మీ గణపతి ఆలయం, రాంబిల్లి మండలం పంచదార్లలోని శ్రీధారమల్లేశ్వరస్వామి ఆలయం, గొలుగొండ మండలం దారమఠంలో శ్రీదామలింగేశ్వర ఆలయం, ఎస్‌.రాయవరం మండలం కొరుప్రోలులో శ్రీ సీతారామస్వామి ఆలయం, తిమ్మాపురంలోని పేరిచర్ల పెద్దిరాజు అన్నదాన సత్రాన్ని వర్గీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 6(బి) కేటగిరీ నుంచి 6(సి)2 కేటగిరీ ఆలయాలుగా వర్గీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - Feb 23 , 2025 | 12:30 AM