Share News

సచివాలయాల హేతుబద్ధీకరణ

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:56 AM

జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలో తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. దీనికి సంబంఽధించి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో భాగంగా జిల్లాలో జనాభా సంఖ్య మేరకు సచివాలయాలకు సిబ్బందిని కేటాయిస్తారు. మిగులు సిబ్బందిని సంబంధిత శాఖలకు పంపిస్తారు.

 సచివాలయాల హేతుబద్ధీకరణ

ఒక్కో చోట జనాభా ప్రాతిపదికగా ఆరు నుంచి ఎనిమిది మంది సిబ్బంది

జిల్లాలో 607 సచివాలయాలు

మంజూరైన పోస్టులు 5,623

ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది :5,170, ఖాళీలు: 453

విశాఖపట్నం/ ఆనందపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):

జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలో తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. దీనికి సంబంఽధించి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో భాగంగా జిల్లాలో జనాభా సంఖ్య మేరకు సచివాలయాలకు సిబ్బందిని కేటాయిస్తారు. మిగులు సిబ్బందిని సంబంధిత శాఖలకు పంపిస్తారు.

జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో 56, జీవీఎంసీ పరిధిలో 551 వెరసి 607 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా మొత్తం 5,623 పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 5,170 మంది పనిచేస్తుండగా 453 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ సచివాలయాల్లో 966 పోస్టులు మంజూరుచేయగా 870 మంది, జీవీఎంసీలో 4,657 పోస్టులకుగాను 4,300 మంది పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో 60, నగరంలో 393 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 400 మంది వివిధ కారణాలతో సెలవులో ఉన్నారు.

హేతుబద్ధీకరణ చేసే క్రమంలో 2,500 కంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయాల్లో ఆరుగురు, 2,500 నుంచి 3,500 మధ్య ఉన్న సచివాలయాల్లో ఏడుగురు, 3,500 మంది కంటే ఎక్కువ ఉన్న సచివాలయాల్లో ఎనిమిది మంది సిబ్బంది ఉంటారు. ఈ మేరకు మండలాల వారీగా కసరత్తు జరుగుతోంది. జీవీఎంసీ పరిధిలో సుమారు 25 లక్షల జనాభాకు 551 సచివాలయాలు ఏర్పాటుచేశారు. సగటున ఒక సచివాలయం పరిధిలో నాలుగువేల కంటే ఎక్కువ జనాభా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మూడు కేటగిరీలుగా విభజించి సిబ్బందిని హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం జిల్లాలో మెజారిటీ సచివాలయాల్లో ఎనిమిది మందికి మించి సిబ్బంది లేరని, 453 ఖాళీలు ఉండడంతో సరిపోతారని భావిస్తున్నారు. హేతుబద్ధీకరణ తరువాత పంచాయతీ కార్యదర్శి/ వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శులను గ్రామ/వార్డు హెడ్‌గా పిలుస్తారు. సచివాలయాలపై పర్యవేక్షణకు మండల, జిల్లాస్థాయిలో వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటుచేసి సిబ్బందిని నియమిస్తారు.

Updated Date - Feb 03 , 2025 | 12:56 AM