Share News

సప్తవర్ణాల రంగవల్లులు

ABN , Publish Date - Jan 05 , 2025 | 10:59 PM

సప్తవర్ణాల రంగవల్లులు.. రంగురంగుల పూలతో అలంకరించిన ముత్యాల ముగ్గులు ఆకట్టుకున్నాయి. పాడేరుకు సంక్రాంతి శోభను తీసుకు వచ్చాయి. ‘ఆంధ్రజ్యోతి’- ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌...ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)కు పాడేరులోని ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం వేదికైంది. ఆదివారం నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సప్తవర్ణాల రంగవల్లులు
పాడేరులో ఉత్సాహంగా ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులు

‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతులు

రంగురంగుల ముగ్గులతో ఉట్టిపడిన తెలుగు సంప్రదాయం

ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు

మరో ఇద్దరికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు

పాడేరులో ముందే వచ్చిన సంక్రాంతి శోభ

పాడేరు, జనవరి 5(ఆంధ్రజ్యోతి):

సప్తవర్ణాల రంగవల్లులు.. రంగురంగుల పూలతో అలంకరించిన ముత్యాల ముగ్గులు ఆకట్టుకున్నాయి. పాడేరుకు సంక్రాంతి శోభను తీసుకు వచ్చాయి. ‘ఆంధ్రజ్యోతి’- ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌...ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)కు పాడేరులోని ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం వేదికైంది. ఆదివారం నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్థానిక అక్షర ఉన్నత పాఠశాల స్పాన్సరర్‌గా వ్యవహరించిన ఈ పోటీల్లో పట్టణానికి చెందిన 41 మంది మహిళలు, యువతులు పాల్గొని వివిధ సంప్రదాయాలు, భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా ఎంతో ఆసక్తిగా ముగ్గులు వేశారు. అయితే చలి తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఉదయం పది గంటలకే పోటీలో పాల్గొనేందుకు మహిళలు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికీ దట్టంగా మంచు కురుస్తుండడంతో ఉదయం పదకొండు గంటలకు ముగ్గుల పోటీలను ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ రమాదేవి, టీచర్లు ఎస్‌.గౌరి, డి.దేవమ్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగ్గులు వేయడం పూర్తయిన వెంటనే పాల్గొన్న వారందరికీ ఉమానీలకంఠేశ్వ స్వామి ప్రసాదాన్ని అందించారు.

విజేతలకు బహుమతులు ప్రదానం

ముగ్గుల పోటీల్లో 41 మంది పాల్గొనగా, వారిలో ప్రతిభ చూపిన ముగ్గురు మహిళలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. వీరిలో ప్రథమ స్థానం సాధించిన పి.లక్ష్మికి ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి రూ.6 వేలు, జ్ఞాపిక, శ్రీభవానీ జ్యువెలర్స్‌ అందించిన వెండి కాయిన్‌, పట్టు చీర అందించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన ఎం.లక్షీలావణ్యకు డీపీఆర్‌వో పి.గోవిందరాజులు రూ.4 వేలు, జ్ఞాపిక, శ్రీభవానీ జ్యువెలర్స్‌ అందించిన వెండి కాయిన్‌, పట్టు చీర ప్రదానం చేశారు. తృతీయ స్థానం సాధించిన పి.ప్రసన్నకు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.రమాదేవి రూ.3వేలు, జ్ఞాపికను, శ్రీభవానీ జ్యువెలర్స్‌ ఇచ్చిన వెండి కాయిన్‌, పట్టు చీర అందజేశారు. అలాగే మరో ఇద్దరు మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మోదకొండమ్మ చిత్రపటాలను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు.

అతిథులకు సత్కారం

ముగ్గుల పోటీల కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారిని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ తరఫున ఘనంగా సత్కరించారు. ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, డీపీఆర్‌వో పి.గోవిందరాజులు, జూనియర్‌ కాలేజీ వైస్‌.ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ రమాదేవి, అక్షర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌ ఇమ్మిడిశెట్టి రాజేశ్‌లకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందించి ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్‌ రిపోర్టర్‌ బి.నాగరాజు, రూరల్‌ రిపోర్టర్‌ ఎం.మహేశ్‌బాబు, ఏబీఎన్‌ రిపోర్టర్‌ బి.హరిబాబు, ఉమానీలకంఠేశ్వర ఆలయ కమిటీ ప్రతినిధులు కె.రామారావు, వీవీ.రత్నం, ఎస్‌.సోమరాజు, వై.శ్రీను, తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమానీలకంఠేశ్వర ఆలయ ధర్మకర్త, కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, అక్షరఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌ ఇమ్మిడిశెట్టి రాజేశ్‌, సిబ్బంది, ‘ఆంధ్రజ్యోతి’ జి.మాడుగుల రిపోర్టర్‌ బి.కొండబాబు, మహిళలు, యువతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 10:59 PM