Share News

ఏయూ వీసీగా రాజశేఖర్‌

ABN , Publish Date - Feb 19 , 2025 | 12:30 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఖరగ్‌పూర్‌ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ నియమితులయ్యారు.

ఏయూ వీసీగా రాజశేఖర్‌

  • ఐఐటీ ప్రొఫెసర్‌ను నియమించిన ప్రభుత్వం

  • స్వస్థలం కె.కోటపాడు మండలం ఏ.కోడూరు

  • తండ్రి ఉద్యోగ రీత్యా సింహాచలంలో స్థిరపడిన కుటుంబం

  • నగరంలోనే విద్యాభాస్యం

  • ఏవీఎన్‌ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ

  • హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఎంఫీల్‌, పీహెచ్‌డీ

  • బోధనలో 27 ఏళ్ల అనుభవం

  • 2002లో యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు

  • విద్యావేత్తల హర్షం

విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఖరగ్‌పూర్‌ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆదేశాల మేరకు ఉన్నత విద్యా శాఖ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఏయూ వీసీగా ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

వీసీ పోస్టు కోసం వర్సిటీకి చెందిన సుమారు పది మంది సీనియర్‌ ప్రొఫెసర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగించారు. అయితే, ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. దేశంలోనే పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఏయూ మరో ఏడాదిలో శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవు తోంది. అంతటి చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల జాబితాలో చోటుదక్కించుకోవాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్‌ల లక్ష్యం. అందుకు అను గుణంగా నిర్ణయాలు తీసుకుని, అమలు చేయడానికి బయట ప్రొఫెసర్‌ అయితే బాగుం టుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందంటున్నారు. విద్యా బోధనలో కీలక మార్పులు చేయడంతో పాటు పరిశోధనలకు పెద్దపీట వేసే ఆలోచనలో పాలకులు ఉన్నారు.

కీలక బాధ్యతలు

ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ అనేక కీలక బాధ్యతలను నిర్వర్తించారు. గేట్‌-2014 ఆర్గనైజింగ్‌ చైర్మన్‌గా, 2014లో గేట్‌ అకడమిక్‌ స్టాండింగ్‌ కమిటీ కన్వీనర్‌గా, 2018-19లో ఐఐటీ ప్లేస్‌మెంట్‌ కమిటీ కన్వీనర్‌గా, 2020లో జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ సభ్యుడిగా బాధ్యతలను నిర్వ ర్తించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌గా, ప్లానింగ్‌ అండ్‌ కో-ఆర్డినేషన్‌ విభాగం డీన్‌గా, కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌గా, టెక్నాలజీ విజన్‌-2047 వర్క్‌షాప్‌ చైర్మన్‌గా, ఐఐటీ ఖరగ్‌పూర్‌ విజన్‌-2030 డాక్యుమెంట్‌ కమిటీ చైర్మన్‌గా, కెరీర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ చైర్మన్‌గా సేవలు ఆయన అందించారు.

బయట నుంచి నియామకం ఇదే తొలిసారి..

ఆంధ్ర యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్లుగా ఇప్పటివరకూ వర్సిటీకి చెందిన, రాష్ట్రంలోని ఇతర వర్సిటీల్లో పనిచేసిన వారినే నియమిస్తూ వచ్చారు. తొలిసారి ఐఐటీ ప్రొఫెసర్‌ను నియమించారు. ఇదిలావుంటే ఇన్‌చార్జి వీసీగా ఉన్న ప్రొఫెసర్‌ జి.శశిభూషణరావును రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన రిలీవ్‌ అయ్యారు. నూతన వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ వర్చువల్‌గా జాయినింగ్‌ ఆర్డర్స్‌ ఉన్నతాధికారులకు పంపిస్తారని, ప్రభుత్వ ఆదేశాలు వచ్చినప్పటి నుంచి ఆయన వీసీగా నియమితులైనట్టేనని ఏయూ అధికారులు చెబుతున్నారు. అధికారికంగా మంచి రోజు చూసుకుని వచ్చి బాధ్యతలు స్వీకరిస్తారంటున్నారు.

గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీలో రాజ కీయాలు బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బయట నుంచి సీనియర్‌ ప్రొఫెసర్‌ను తీసుకు రావడం ద్వారా వాటన్నింటికీ చెక్‌ చెప్పడంతో పాటు వర్సిటీ పాలనను గాడిలో పెట్టవచ్చునని ప్రభుత్వం భావించినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా తాజా నిర్ణయంతో వర్సిటీ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. రాజకీయాలకు, వ్యక్తిగత అజెండాలకు దూరంగా వర్సిటీ పాలన సాగేందుకు అవకాశం ఉంటుం దని విశ్లేషిస్తున్నారు.

ఇదీ నేపథ్యం..

నూతన వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ స్వస్థలం అనకాపల్లి జిల్లా కె.కోట పాడు మండలం ఏ.కోడూరు. అయితే కుటుంబం తండ్రి ఉద్యోగరీత్యా సింహాచలంలో స్థిరపడింది. రాజశేఖర్‌ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సింహాచలంలోని మండల పరిషత్‌ ప్రాథమి కోన్నత పాఠశాలలో, ఏడు నుంచి పదో తరగతి వరకూ సెయింట్‌ ఆంథోనీ స్కూల్‌లో, ఇంటర్‌, డిగ్రీ (మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ర్టీ సబ్జెక్టులతో) ఏవీఎన్‌ కాలేజీలో చదువుకున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ (అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌), ఎంఫిల్‌ చేసిన ఆయన... 1997లో అక్కడే పీహెచ్‌డీ పూర్తిచేశారు. ప్రొఫెసర్‌ రాజశేఖర్‌కు 27 ఏళ్ల బోధన, పరిశోధన అనుభవం ఉంది. ఇప్పటివరకూ ఆయన వద్ద 14 మంది డాక్టరేట్‌ డిగ్రీలు అందుకున్నారు. మరో నలుగురు పీహెచ్‌డీ పూర్తిచేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆరు పరిశోధన ప్రాజెక్టులు పూర్తిచేశారు. 112 రీసెర్చ్‌ పబ్లికేషన్స్‌ వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 2002లో యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డ్‌ ఇన్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ను ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ అందించింది. ఈ అవార్డును అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా అందుకున్నారు. వీటితో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులను, గోల్డ్‌ మెడల్స్‌ను రాజశేఖర్‌ అందుకున్నారు.

ఏయూ నుంచి ఇద్దరికీ వీసీలుగా అవకాశం

  • నన్నయ వర్సిటీకి ప్రొఫెసర్‌ ప్రసన్న శ్రీ

  • కృష్ణా వర్సిటీకి ప్రొఫెసర్‌ రాంజీ

ఏయూకు చెందిన ఇద్దరు సీనియర్‌ ప్రొఫెసర్లు రాష్ట్రంలోని మరో రెండు వర్సిటీలకు వీసీలుగా నియమితులయ్యారు. ఇంగ్లీష్‌ విభాగానికి చెందిన సీనియర్‌ ప్రొఫెసర్‌ ప్రసన్న శ్రీ రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి వీసీగా నియమితులయ్యారు. ఆమె స్వస్థలం విజయవాడ కాగా, గడిచిన 25 ఏళ్ల నుంచి ఏయూలోనే పనిచేస్తున్నారు. ఆమె గిరిజనుల లిపికి సంబంధించి పరిశోధనలు సాగించారు. అలాగే, ఏయూకు చెందిన మరో ప్రొఫెసర్‌ కె.రాంజీ మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాంజీ గతంలో ఆ జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్సలర్‌గా సేవలు అందించారు. తాజాగా మరోసారి వీసీగా నియమితులయ్యారు.

Updated Date - Feb 19 , 2025 | 12:30 AM