రైల్వే స్టేషన్ ఆధునికీకరణ
ABN , Publish Date - Feb 04 , 2025 | 01:14 AM
అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో అభివృద్ది పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద అనకాపల్లి రైల్వే స్టేషన్‌ను గతంలోనే ఎంపిక చేసింది.
అమృత్ భారత్ కింద రూ.27.3 కోట్లు మంజూరు
చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనులు
అందుబాటులోకి రానున్న ఎస్కలేటర్, లిఫ్ట్, కాలిబాట వంతెన
ఆఽధునాతన బాత్‌రూమ్స్, వెయింటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు
రైల్వే క్వార్టర్స్ స్థలంలో వాణిజ్య భవన సముదాయం
ఈ ఏడాది చివరినాటికి పూర్తవుతాయని అంచనా
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో అభివృద్ది పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద అనకాపల్లి రైల్వే స్టేషన్‌ను గతంలోనే ఎంపిక చేసింది. రూ.27.3 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు 2023 ఆగస్టు ఆరో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే అనకాపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ప్రయాణికులకు పలు రకాల సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ-1 గ్రేడ్‌లో వున్న అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఏళ్ల తరబడి అభివృద్ధికి, ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఎస్కలేటర్, లిఫ్ట్ వంటి సదుపాయాలు లేకపోవడంతో ప్లాట్ ఫారాల మీదుకు వెళ్లడానికి వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్ ఫారాలపై పూర్తిగా షెడ్లు లేకపోవడంతో వర్షాకాలంలో ఆయా బోగాల్లో ఎక్కే/ దిగే ప్రయాణికులు తడిసిపోతున్నారు. ఈ సమస్యలను నివారించడానికి, మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద నిధులు కేటాయించింది. రెండు, మూడు ప్లాట్‌ఫారాలపై మార్బుల్స్ వేస్తున్నారు. రైల్వేస్టేషన్‌కు తూర్పు భాగంలో కాలినడక వంతెన, ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. రెండు, మూడు ప్లాట్‌ఫారాల మధ్య ఆఽధునిక బాత్‌రూమ్స్, వెయింటింగ్ హాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడే ‘వన్ నేషన్- వన్ ప్రోడక్టు’ కింద ఏటికొప్పాక లక్కబొమ్మల స్టాల్, ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఒకటో నంబరు ప్లాట్‌ఫారానికి సమీపంలో ఉన్న రైల్వే క్వార్టర్స్ స్థానంలో వాణిజ్య భవన సముదాయాన్ని నిర్మిస్తారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లో ఆరు ట్రాక్‌లు ఉన్నాయి. మూడో ప్లాట్‌ఫారం వైపు మరో ట్రాక్ అందుబాటులో వస్తుంది. రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులకు 2023 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో నాటి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి మాట్లాడుతూ, ఏడాదిలోగా అభివృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పారు. కానీ ఏడాదిన్నర అయినప్పటికీ పూర్తికాలేదు. అనకాపల్లి ప్రస్తుత ఎంపీ సీఎం రమేశ్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇటీవల పరిశీలించారు. పనులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను, రైల్వే అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ ఏడాది చివరినాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు.