జంపపాలెం రేషన్ డీలర్‌పై వేటు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:55 AM
మండలంలోని జంపపాలెంలో రేషన్ కార్డుదారులకు రాళ్లు, ఎలుకల వ్యర్థాలు వున్న బియ్యం పంపిణీ చేయడాన్ని జిల్లా అధికారులు తీవ్రంగా పరిగణించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. బాధ్యులైన రేషన్ డీలర్, ఎండీయూ వాహనం డ్రైవర్లను సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

ఎండీయూ ఆపరేటర్‌పైనా చర్యలు
ఇద్దరినీ సస్పెండ్ చేయాలని జేసీ జాహ్నవి ఆదేశాలు
రేషన్ బియ్యంలో రాళ్లు, ఎలుకల వ్యర్థాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక
రేషన్ డిపోను తనిఖీ చేసి, కార్డుదారులతో మాట్లాడిన జేసీ
పర్యవేక్షణ లేదంటూ పౌరసరఫరాల శాఖ అధికారులపై ఆగ్రహం
ఎలమంచిలి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జంపపాలెంలో రేషన్ కార్డుదారులకు రాళ్లు, ఎలుకల వ్యర్థాలు వున్న బియ్యం పంపిణీ చేయడాన్ని జిల్లా అధికారులు తీవ్రంగా పరిగణించారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. బాధ్యులైన రేషన్ డీలర్, ఎండీయూ వాహనం డ్రైవర్లను సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
పౌర సరఫరాల శాఖ అధికారులు ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో రాళ్లు, ఎలుకల పెంటికలు వస్తున్నాయని ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామస్థులు ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ఇదే విధమైన బియ్యం అందజేస్తున్నారని, రేషన్ డీలర్లకు చెప్పినా పట్టించుకోవడంలేదని వాపోయారు. అంతేకాక గ్రామానికి చెందిన దేవకీనాయుడు అనే వ్యక్తి ఏకంగా మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎలమంచిలి పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారు కె.నూకరాజు, ఆర్‌ఐ విష్ణు గురువారం జంపపాలెం వెళ్లి వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని చెప్పారు. ఈ వ్యవహారంపై ‘రేషన్ బియ్యంలో రాళ్లు, ఎలుకల వ్యర్థాలు’ అన్న శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తతో జిల్లా అధికారులు స్పందించారు. జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి శుక్రవారం పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతి, తహసీల్దారు వరహాలు, ఇతర అధికారులతో కలిసి జంపపాలెం వచ్చారు. రాళ్లు, ఎలుకల వ్యర్థాలతో వున్న బియ్యం పంపిణీ చేసిన 30వ నంబరు రేషన్ డిపోను తనిఖీ చేశారు. బస్తాల్లో ఉన్న బియ్యాన్ని జేసీ పరిశీలించారు రాళ్లు, ఎలుకల వ్యర్థాలు ఉన్న బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేశారంటూ రేషన్ డిపో డీలర్ సతీశ్‌కుమార్‌ను ప్రశ్నించారు. మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన దేవకీనాయుడుతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యంలో రాళ్లు, ఇతర వ్యర్థాలు ఎంతకాలం వస్తున్నాయని ఆయనను అడిగారు. రేషన్ బియ్యం సరఫరా, పంపిణీని ఎందుకు పర్యవేక్షించడం లేదంటూ పౌరసరఫరాల అధికారులపై ఆమె మండిపడ్డారు.రేషన్ బియ్యంలో రాళ్లు ఉన్నట్లు 12వ తేదీన ఫిర్యాదు వస్తే శుక్రవారం షాకాజ్ నోటీసు ఇవ్వడం ఏమిటని గట్టిగా ప్రశ్నించారు. 30వ నంబరు రేషన్ డిపో డీలర్ సతీశ్‌కుమార్, ఎండీయూ వాహనం ఆపరేటర్ పిల్లా నాగేంద్రలను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.