మసాజ్ ముసుగులో వ్యభిచారం
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:47 AM
నగరంలోని కొన్ని మసాజ్ సెంటర్లు వ్యభిచార కూపాలుగా మారిపోయాయి.
కొన్ని మసాజ్ సెంటర్లలో అదే ప్రత్యేకత
పోలీసుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు
అందుకు ప్రతిగా నెలవారీ మామూళ్లు అందుతున్నాయని ప్రచారం
అన్ని సెంటర్ల నుంచి రూ.15 లక్షల వరకూ కలెక్షన్లు
కొన్ని మసాజ్ సెంటర్ల నిర్వాహకులే పోలీసులకు మధ్యవర్తులు..
ఏదైనా ఫిర్యాదు వస్తే నిర్వాహకులకు సమాచారం చేరవేత
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలోని కొన్ని మసాజ్ సెంటర్లు వ్యభిచార కూపాలుగా మారిపోయాయి. మసాజ్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరిగిపోతోంది. దీనిపై పోలీసులకు పూర్తి సమాచారం ఉన్నప్పటికీ నిర్వాహకుల నుంచి నెలవారీ మామ్మూళ్లు అందుతుండడంతో అటువైపు చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులు ఆకస్మిక తనిఖీల పేరుతో నిర్వాహకులను పరోక్షంగా బెదిరించి దారికి తెచ్చుకున్నారని ఆ శాఖ సిబ్బందే విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణ మసాజ్ సేవలందించే సెంటర్ల నుంచి వచ్చే మామూళ్ల కంటే క్రాస్ మసాజ్ చేసే సెంటర్లు, వ్యభిచారం నిర్వహించే సెంటర్ల నుంచి రెట్టింపు మామూళ్లను గుంజుతున్నారని పోలీ్‌స శాఖలోనే ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా సీతంపేటలోని మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో బయటపడడం మసాజ్ సెంటర్ల వ్యవహారాలపై చర్చకు దారితీసినట్టయింది.
కొన్నాళ్ల కిందటి వరకు మెట్రో పాలిటన్ నగరాలకు పరిమితమైన మసాజ్ సెంటర్ల సంస్కృతి ఇప్పుడు నగరంలో వేళ్లూనుకుపోయింది. శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సేవలందించాల్సిన మసాజ్ సెంటర్లలో అన్ని రకాల సేవలు, సుఖాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వీటికి డిమాండ్ పెరిగిపోయింది. ఆదాయం దండీగా ఉండడంతో నగరంలో మసాజ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పోలీసుల అంచనా ప్రకారం విశాఖపట్నంలో ప్రస్తుతం 260 వరకు మసాజ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్డు, వీఐపీ రోడ్డు, సిరిపురం, గాజువాక, మధురవాడ, ద్వారకానగర్, సీతంపేట, లాసెన్స్‌బే కాలనీ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. బ్యూటీ పార్లర్లు, స్పాలు, మసాజ్ సెంటర్లు, రిలాక్స్ సెంటర్లు, వెల్‌నెస్ సెంటర్స్, హెల్త్ క్లబ్‌లు... ఇలా పేర్లు ఏవైనా అన్నీ బ్యూటీషియన్ అండ్ కాస్మోటిక్‌కు సంబంధించిన సేవలను మాత్రమే అందించాలి. బ్యూటీషియన్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ నిబంధనల ప్రకారం మసాజ్ సెంటర్లకు వచ్చే మహిళలు, పురుషులు వచ్చిపోయేందుకు వేర్వేరు ప్రవేశ మార్గాలు ఉండాలి. సెంటర్ లోపల కూడా మసాజ్ చేసేందుకు మగవారికి వేరుగా, ఆడవారికి వేరుగా విభాగాలు ఉండాలి. మసాజ్ చేసే గదిలో టాయ్‌లెట్లు, బాత్‌రూమ్‌లు వేర్వేరుగా ఉండడంతో పాటు లోపల నుంచి అంతర్గత ద్వారాలు ఉండకూడదు. సెంటర్‌లోకి వెళ్లిన వారికి మసాజ్ గదిలో ఉన్నవారు, మసాజ్ గదిలో ఉన్నవారికి బయట ఉన్నవారు స్పష్టంగా కనిపించేలా అద్దాలను మాత్రమే ఏర్పాటు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మసాజ్ గదిని మూసి ఉంచకూడదు. అలాగే ఒక మసాజ్ సెంటర్‌లో పది మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్టయితే వారందరికీ గుర్తింపు కార్డులు, మహిళా భద్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ వంటివి అందుబాటులో ఉంచాలి. ప్రతి సెంటర్‌లో ఫిజియోథెరపిస్టు లేదా ఆక్యుప్రెజర్ లేదా అక్యుపేషనల్ థెరపీలో డిగ్రీ, డిప్లొమా లేదంటే సర్టిఫికెట్ కోర్సు చేసిన వాళ్లను నియమించుకోవాలి. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మాత్రమే సేవలందించాలి. అలాగే సెంటర్‌కు వచ్చే వినియోగదారులకు అందించే సేవలను రికార్డు చేసేలా అన్నిచోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు కనీసం మూడు నెలల ఫుటేజీ స్టోరేజీ ఉండేలా హార్డ్ డిస్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
మసాజ్ సెంటర్‌లోనే అన్ని సేవలు..
అయితే నగరంలోని కొన్ని మసాజ్ సెంటర్లలో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన యువతులను నియమించుకుంటున్నారు. వారితో కస్టమర్లకు మసాజ్‌లు చేయిస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని సెంటర్ల నిర్వాహకులు మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. తమ వద్ద ఉద్యోగులుగా చెప్పుకునే యువతులతోనే వ్యభిచారం చేయిస్తున్నారు. ఒక్కో సేవకు ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. సాధారణ మసాజ్‌కు ఒక రేటు, క్రాస్ మసాజ్ (మగవారికి ఆడవారితో మసాజ్) కావాలనుకుంటే ఒక రేటు, శృంగారం చేయాలనుకుంటే మరొక రేటు ఉంటోంది. మసాజ్ కాకుండా ఇతర సేవలు ఏవైనా సరే ముందుగా రిసెప్షన్‌లో రూ.ఐదు వేలు చెల్లించాలి. మసాజ్ గదిలోకి వెళ్లిన తర్వాత మసాజ్ చేసే యువతితో గడపాలనుకుంటే ఆమెకు రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చెల్లించాల్సి ఉంటుంది. మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతోందని ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే పోలీసులు దాడి చేయడానికి ముందే నిర్వాహకులకు సమాచారం చేరిపోతుంది. దీంతో పోలీసులు తనిఖీలకు వెళ్లేసరికే నిర్వాహకులు అప్రమత్తమై ఎలాంటి ఉల్లంఘనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగిన ఆనవాళ్లు లేకుండా సరిచేసేసుకుంటున్నారు. కొన్నాళ్ల కిందట నగరంలోని స్పా సెంటర్లపై ఆకస్మిక తనిఖీలకు సీపీ ఆదేశించగా.. ఫోర్త్ టౌన్ పోలీసులు తమ పరిఽధిలోని ఒక స్పాలో తనిఖీ చేస్తుండగా అక్కడ ఒక ఎస్‌ఐ మఫ్టీలో పట్టుబడ్డారు. దీనిపై సీపీకి సమాచారం అందించడంతో సదరు ఎస్‌ఐను సస్పెండ్ చేయడం పోలీసులకు స్పా నిర్వాహకులతో సంబంధాలున్నాయనే అభిప్రాయాలకు బలాన్ని చేకూర్చినట్టయింది.
పోలీసులకు ప్రతినెలా రూ.15 లక్షల మామూళ్లు!
నగరంలోని మసాజ్ సెంటర్ల నుంచి కొంతమంది పోలీసులకు ప్రతినెలా రూ.15 లక్షల వరకు మామూళ్లుగా అందుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని 260 మసాజ్ సెంటర్లు ఉండగా... వీటిలో 50 సెంటర్లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయా సెంటర్ల నుంచి నెలకు రూ.పది వేలు, మిగిలిన సెంటర్ల నుంచి రూ.ఐదు వేల చొప్పున మామ్మూళ్లుగా పోలీస్ అధికారులకు అందుతున్నట్టు సమాచారం. ఈ వసూళ్లలో పోలీసులు నేరుగా తలదూర్చకుండా సిరిపురంలోని ఒక స్పా నిర్వాహకుడు, వీఐపీ రోడ్డులోని మరొక స్పా నిర్వాహకుడు, ప్రముఖ స్పాలో పనిచేసి బయటకు వచ్చి సొంతంగా సీతమ్మధారలో స్పా పెట్టుకున్న మరొకరు, గాజువాకలోని స్పా నిర్వాహకుడొకరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. వీరంతా నగరంలోని మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ డబ్బులు వసూలు చేసి తమకు సహకరించే పోలీసు అధికారులకు అందజేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి మసాజ్ సెంటర్లకు అండదండలు అందిస్తున్న ఇతర పోలీసులకు వాటాలు చేరిపోతున్నాయని పోలీ్‌స శాఖలోనే ప్రచారం జరుగుతోంది. అందుకే మసాజ్ సెంటర్‌లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే మామూళ్లు అందుకుంటున్న అధికారులు స్పా నిర్వాహకులకు ముందుగానే సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీపీగా శంఖబ్రత బాగ్చి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్పాల జోలికి పోలీసులు వెళ్లడం మానేసినా, గత కొద్ది రోజులుగా మళ్లీ కౌంటర్ తెరిచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరంలో మొత్తం మసాజ్ సెంటర్లు 260
వ్యభిచారం జరిగేవి 50 (అంచనా)
ఒక్కో సెంటర్ నుంచి పోలీసులకు మామూళ్లు రూ.ఐదు వేలు
వ్యభిచారం జరిగే వాటి నుంచి రూ.పది వేలు
నెలకు మొత్తం వసూలు చేస్తున్న మొత్తం రూ.15 లక్షలు