Share News

పక్కాగా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:08 AM

గడిచిన కొన్నాళ్లుగా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

పక్కాగా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌

  • పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ పరీక్షలు

  • జిల్లాలో 17,77,440 మంది

  • ఇప్పటివరకూ 2,61,670 మందికి స్ర్కీనింగ్‌

  • 2,120 మందికి అనుమానిత లక్షణాలు

  • అందులో 600 మందికి రెండో దశ పరీక్షలు

  • కేజీహెచ్‌కు 20 మంది...

  • నాన్‌ కమ్యూనికేబుల్‌ వ్యాధుల వివరాలు కూడా సేకరణ

  • బీపీతో 25,700 మంది, షుగర్‌తో 19,290 మంది బాధపడుతున్నట్టు గుర్తింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గడిచిన కొన్నాళ్లుగా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బాధితుల్లో దాదాపు మూడొంతుల మంది రెండు, మూడు దశలు దాటిన తరువాత గానీ గుర్తించలేకపోతున్నారు. దీంతో కొన్ని సంద ర్భాల్లో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రాణాలను కాపాడలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. గత ఏడాది నవంబరులో ఈ ప్రోగ్రామ్‌ ప్రారంభం కాగా...ఈ ఏడాది ఆగస్టు వరకు కొనసాగ నున్నది. పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయనున్నారు. జిల్లాలో పరీక్షించాల్సిన జనాభా 17,77,440 మందిగా అధికారులు గుర్తించారు. ఇప్పటివరకూ 2,61, 670 మందికి స్ర్కీనింగ్‌ (13 శాతం) పూర్తయి నట్టు అధికారులు చెబుతున్నారు.

అనుమానిత కేసులు గుర్తింపు

ఏఎన్‌ఎంలు, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు ఇంటింటికీ వెళ్లి ఈ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ నిర్వ హిస్తున్నారు. అనుమానిత కేసులు గుర్తిస్తే స్థానిక పీహెచ్‌సీ వైద్యులకు సమాచారాన్ని అందిస్తారు. సదరు వైద్యుడు మరోసారి స్ర్కీనింగ్‌ చేసి కేన్సర్‌ లక్షణాలుగా అనుమానిస్తే కేజీహెచ్‌కు రిఫర్‌ చేసి, తదుపరి వైద్యం ప్రారంభమయ్యేలా చూస్తారు. జిల్లాలో ఇప్పటివరకూ 2,61,670 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 720 మందికి నోటి క్యాన్సర్‌ లక్షణాలు, 670 మందికి రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలు, 730 మందికి సర్వైకల్‌ క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ 2,120 మందిలో 600 మందికి రెండో దశ పరీక్షలు నిర్వహించిన అనంతరం 20 మందిని కేజీహెచ్‌కు రిఫర్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

బీపీ, షుగర్‌ కేసులు భారీగా..

క్యాన్సర్‌తోపాటు ఇతర నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌లకు సంబంధించిన వివరాలను వైద్య సిబ్బంది సేకరిస్తున్నారు. ఇప్పటివరకూ పూర్తి చేసిన సర్వే ప్రకారం జిల్లాలో 25,700 మంది హైపర్‌ టెన్షన్‌, 19,290 మంది షుగర్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ కేసులు సంఖ్య భారీగా ఉంటోందని చెబుతున్నారు. ప్రతి నాలుగైదు ఇళ్లలో వీటిలో ఏదో ఒక కేసు ఉంటోందని, గతంతో పోలిస్తే షుగర్‌, బీపీ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

పకడ్బందీగా స్ర్కీనింగ్‌ నిర్వహించాలని ఆదేశించాం

- డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ మేరకు క్షేత్ర స్థాయి సర్వే చేసే సిబ్బందికి తగిన సూచనలు చేశాం. ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే విషయాలను తెలియ జేశాం. అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వారికి ఇప్పటివరకూ దానిపై కనీసం అవగాహన కూడా లేదని వెల్లడైంది. ఈ తరహా ఇబ్బందులను అధిగమించేందుకే ప్రభుత్వం ఈ స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టింది.

నిరంతరం పర్యవేక్షిస్తున్నాం

- డాక్టర్‌ హారిక, ఆర్‌బీఎస్‌కే, ఎన్‌సీడీసీడీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌

క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ను పక్కాగా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిరంతరం స్ర్కీనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాం. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వారికి కేటాయించిన జాబితాలోని వివరాలను సేకరించి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అనుమానిత లక్షణాలు ఉన్నట్టయితే స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌కు వివరాలు తెలియజేస్తారు. మెడికల్‌ ఆపీసర్‌ వారిని మరోసారి పరీక్షించి అవసరమైతే కేజీహెచ్‌కు రిఫర్‌ చేస్తారు. ఇక్కడ మిగిలిన పరీక్షలు పూర్తిచేసి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.

Updated Date - Jan 25 , 2025 | 01:08 AM