ప్రైవేటు కళాశాల బరితెగింపు
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:02 AM
విశాఖ జూనియర్ కళాశాల (ఒకేషనల్) నిర్వాహకులు బరితెగించారు.

అనుమతి లేని భవనంలో తరగతులు
ఒకేషనల్‌కు పర్మిషన్ తీసుకుని నర్సింగ్ కోర్సులు నిర్వహణ
షీలానగర్‌లోని విజయకృష్ణ నర్సింగ్ కళాశాలతో ఒప్పందం
ఫీజు కింద రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వసూలు
టెన్త్ సర్టిఫికెట్లు వెనక్కి ఇచ్చేందుకు కూడా డబ్బులు డిమాండ్
విద్యార్థుల ఫిర్యాదుతో ఇంటర్‌బోర్డు అధికారుల తనిఖీలు
మూడుసార్లు నోటీసులు జారీ చేసిన ఆర్‌ఐవో
పట్టించుకోని యాజమాన్యం
జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ దృష్టికి వ్యవహారం
మద్దిలపాలెం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి)
విశాఖ జూనియర్ కళాశాల (ఒకేషనల్) నిర్వాహకులు బరితెగించారు. ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
డాబాగార్డెన్స్ ప్రాంతంలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపాన విశాఖ జూనియర్ కళాశాల (ఒకేషనల్) ఉంది. అయితే కళాశాల నిర్వాహకులు ఇంటర్, ఒకేషనల్ తరగతుల నిర్వహణకు అనుమతి పొంది నర్సింగ్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు షీలానగర్‌లోని విజయకృష్ణ నర్సింగ్ కళాశాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ తరగతులు చెబుతూ...విజయకృష్ణ కాలేజీ పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇందుకుగాను ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు పదవ, ఇంటర్ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వడానికి మరో రూ.10 వేలు నుంచి రూ.20 వేలు వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి కళాశాల యాజామాన్యం డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి (ఆర్‌ఐవో) మురళీధర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం తనిఖీకి వెళ్లిన బోర్డు అధికారులు కళాశాల నిర్వహణ చూసి ఖంగుతిన్నారు. అనుమతి పొందిన చిరునామాలో కాకుండా వేరే భవనంలో కళాశాల నిర్వహిస్తున్నట్టు, ఒకేషనల్ కళాశాల అనుమతి పొంది నర్సింగ్ కోర్సులు బోధిస్తున్నట్టు గుర్తించారు. మొదట అంతస్థులో షాపింగ్ మాల్, రెండో అంతస్థులో చర్చి ఉండగా...మూడో అంతస్థులో జూనియర్ కళాశాల, ఆపై అంతస్థులో అనధికారికంగా వసతి గృహం నిర్వహిస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి లేని భవనంలో కళాశాల, నర్సింగ్ కోర్సులు ఎందుకు నిర్వహిస్తున్నారో తెలపాలని యాజమాన్యానికి ఆర్‌ఐవో మురళీధర్ నోటీసులు ఇచ్చారు. ఆర్‌ఐవో నోటీసులకు కళాశాల నిర్వాహకులు స్పందించకపోగా విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఆర్‌ఐవో గురువారం మరో రెండు దఫాలు నోటీసులిచ్చారు. వాటికి కూడా స్పందించకపోవడంతో కళాశాలపై చర్యలు తీసుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ ఇంటర్ బోర్డు కమిషనర్‌కు లేఖ రాశారు. ఇదిలావుండగా ఆర్‌ఐవో ఆదేశించినా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు గురువారం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా ఆర్‌ఐవోను సంప్రతించి కళాశాల సీజ్ చేయాలని సూచించారు. కలెక్టర్ కూడా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఐవోకి ఆదేశించగా పరీక్షల సమయంలో కళాశాల సీజ్ చేస్తే విద్యార్థులు రోడ్డున పడతారని ఆయన వివరించారు.
పరీక్షలు ముగియగానే చర్యలు
మురళీధర్, ఆర్‌ఐవో
విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సర్టిఫికెట్లు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వారికి ధ్రువపత్రాలు ఇచ్చేయాల్సిందిగా యాజమాన్యాన్ని ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనుమతి లేని భవనంలో కళాశాల నిర్వహించడమే కాకుండా నర్సింగ్ కోర్సులు నిర్వహిస్తున్నారు. దీనిపై కళాశాల యాజామాన్యానికి నోటీసులిచ్చాం. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం లేనందున చర్యలకు కమిషనర్‌కు లేఖ రాశాం. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు ముగియగానే కళాశాలపై చర్యలు తీసుకుంటాము.