Share News

ప్రధాని రోడ్‌షో

ABN , Publish Date - Jan 03 , 2025 | 01:26 AM

ప్రధాని నరేంద్రమోదీ ఈనెల ఎనిమిదో తేదీన విశాఖపట్నం రానున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

ప్రధాని రోడ్‌షో

సంపత్‌ వినాయక ఆలయం నుంచి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేస్తున్న బహిరంగ సభా వేదిక వరకూ నిర్వహణ

రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం, ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటు, నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్కులకు శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోదీ

సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా

ప్రధాని పర్యటన కార్యక్రమం పర్యవేక్షణకు ముగ్గురు మంత్రులతో కమిటీ

నేడు ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రులు భేటీ

విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):

ప్రధాని నరేంద్రమోదీ ఈనెల ఎనిమిదో తేదీన విశాఖపట్నం రానున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సభకు సుమారు లక్ష మందిని సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం... ఆశీల్‌మెట్టలో గల సంపత్‌ వినాయక్‌ ఆలయం వద్ద నుంచి సభా ప్రాంగణం వరకూ ఓపెన్‌టాప్‌ వాహనంలో ప్రధాని రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌లు రోడ్‌షోలో పాల్గొంటారు.

వేదిక వద్ద ప్రధానమంత్రి పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద ఎన్‌టీపీసీ ఏర్పాటుచేసే గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌ప్లాంటుకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే నక్కపల్లి మండలంలో 2000 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,876.76 కోట్లతో ఏర్పాటుచేయనున్న బల్స్‌ డ్రగ్‌ పార్కు పనులను ప్రారంభిస్తారు. అదేవిధంగా నిర్మాణాలు పూర్తిచేసుకున్న దక్షిణ, తూర్పుభారతానికి చెందిన పలు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ఈ వేదిక నుంచే జాతికి అంకితం చేస్తారు. కాగా ప్రధాని ఎయిర్‌పోర్టులోని ఐఎన్‌ఎస్‌ డేగాలో విమానం దిగిన తరువాత నేరుగా రోడ్డు మార్గాన నగరంలోకి రానున్నారు. తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు సభా వేదికకు సమీపంలో ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన మరో మైదానంలో మూడు హెలిప్యాడ్‌లు సిద్ధంచేస్తున్నారు.

ముగ్గురు మంత్రులతో కమిటీ

ప్రధాని సభ నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ముగ్గురు మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో కమిటీలో ఉన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. జన సమీకరణ బాధ్యతను స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.

అధికారులు కసరత్తు

ప్రధాని పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. గురువారం అధికారులతో కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ సమీక్ష నిర్వహించారు. సభ విజయవంతం కోసం 42 కమిటీలు వేశారు. ఎయిర్‌పోర్టులో ప్రధాని దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకూ ఎక్కడికక్కడ తగిన జాగ్రత్తలు తీసుకునే బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐఏఎస్‌ అధికారులు, సీనియర్‌ ఆర్డీవోలు, పోలీస్‌ అధికారులను ఈ కమిటీల్లో నియమించారు. విశాఖ పోర్టుతోపాటు మరికొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులకు మరికొన్ని బాధ్యతలు అప్పగించారు.

Updated Date - Jan 03 , 2025 | 01:26 AM