మందకొడిగా బాల ఆధార్
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:13 AM
అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల ఆధార్ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ప్రతి నెల చివరి ఆరు రోజులు ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆశించినంత స్పందన ఉండడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆరేళ్ల లోపు పిల్లల్లో ఇంకా లక్ష పైచిలుకు మంది చిన్నారులకు ఆధార్ నమోదు కాలేదు. ఇందులో మూడో వంతు మంది అనకాపల్లి జిల్లాలో వున్నారు.

ప్రత్యేక శిబిరాలపై కొరవడిన ప్రచారం
0-6 ఏళ్ల లోపువారికి అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు
ఉమ్మడి విశాఖ జిల్లాలో గత అక్టోబరునాటికి 1,22,941 మందికి ఆధార్ లేదని గుర్తింపు
జనవరి పదో తేదీకి 17,283 మందికి మాత్రమే ఆధార్ నమోదు
ఆధార్ చేయించుకోని చిన్నారులు 1,05,658 మంది
వీరిలో 24,598 మంది అనకాపల్లి జిల్లా పిల్లలు
ఈ నెలాఖరు వరకు ప్రత్యేక శిబిరాలు
శత శతం నమోదుకు ప్రయత్నాలు
రోలుగుంట, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల ఆధార్ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ప్రతి నెల చివరి ఆరు రోజులు ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆశించినంత స్పందన ఉండడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆరేళ్ల లోపు పిల్లల్లో ఇంకా లక్ష పైచిలుకు మంది చిన్నారులకు ఆధార్ నమోదు కాలేదు. ఇందులో మూడో వంతు మంది అనకాపల్లి జిల్లాలో వున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది అక్టోబరు నుంచి ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలపై దృష్టిపెట్టింది. బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. ఆ సమయానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో 0-6 ఏళ్ల లోపు ఆధార్ లేని పిల్లలు 1,22,941 మంది వున్నట్టు గుర్తించారు. వీరిలో 72,529 ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే వున్నారు. అనకాపల్లి జిల్లాలో 31,422 మంది, విశాఖ జిల్లాలో 18,990 మంది పిల్లలు ఉన్నారు. గత ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జనవరి పదో తేదీ వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రత్యేక శిబిరాల ద్వారా 17,283 మంది (ఆరేళ్ల లోపు) పిల్లలకు మాత్రమే ఆధార్ నమోదు చేశారు. జనవరి 11వ తేదీనాటికి అల్లూరి జిల్లాలో 68,095, అనకాపల్లి జిల్లాలో 24,598 మంది, విశాఖ జిల్లాలో 12,965 మంది.. మొత్తం 1,05,658 మంది పిల్లలకు ఆధార్ నమోదు కాలేదు.
ప్రచార లోపమే కారణం
ప్రత్యేక ఆధార్ శిబిరాల ఏర్పాటుపై ప్రచారం లేకపోవడం వల్లనే నమోదుకు స్పందన అరకొరగా వుంటున్నది. ఆధార్ నమోదు శిబిరాల గురించి గ్రామ/ వార్డు సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది తమ పరిధిలో ఆరేళ్ల లోపు పిల్లలు వున్న ప్రతి ఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు తెలియపరచాలి. కానీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేయకపోవడంతో ప్రత్యేక ఆధార్ నమోదు గురించి చాలా మందికి తెలియడంలేదు. దీంతో సచివాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఆధార్ నమోదు శిబిరాలు వెలవెలబోతున్నాయి.
శత శాతం నమోదుకు చర్యలు
అనంతలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ, అనకాపల్లి జిల్లా
జిల్లాలో ఆరేళ్లలోపు చిన్నారుల ఆధార్ నమోదుకు 56 గ్రామ సచివాలయాల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక శిబిరాల ద్వారా శత శాతం ఆధార్ నమోదుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రతి మండలానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆధార్ నమోదును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించాం.