Share News

పక్కాగా భూముల రీసర్వే

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:55 AM

భూముల సర్వే విషయంలో గత వైసీపీ హయాంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా కూటమి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా భూముల రీ సర్వే చేపట్టింది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ప్రతి 250 ఎకరాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్‌లో సచివాలయ సర్వేయర్లు ఇద్దరు, ఒక వీఆర్‌వో, ఒక వీఆర్‌ఏ ఉంటారు. సర్వే టీమ్‌కి సపోర్ట్‌గా వీఆర్‌వో, విలేజ్‌ సర్వేయర్‌ని అదనంగా నియమించారు.

పక్కాగా భూముల రీసర్వే
రైతుకు నోటీసు అందజేస్తున్న సర్వే బృందం

పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామం ఎంపిక

250 ఎకరాలకు ఒక బృందం చొప్పున నియామకం

ప్రతి టీమ్‌లో ఇద్దరు సచివాలయ సర్వేయర్లు, ఒక్కో వీఆర్‌వో, వీఆర్‌ఏ

గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు

నర్సీపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): భూముల సర్వే విషయంలో గత వైసీపీ హయాంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా కూటమి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా భూముల రీ సర్వే చేపట్టింది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ప్రతి 250 ఎకరాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్‌లో సచివాలయ సర్వేయర్లు ఇద్దరు, ఒక వీఆర్‌వో, ఒక వీఆర్‌ఏ ఉంటారు. సర్వే టీమ్‌కి సపోర్ట్‌గా వీఆర్‌వో, విలేజ్‌ సర్వేయర్‌ని అదనంగా నియమించారు.

నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్‌లో 357 గ్రామాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో 208 గ్రామాలలో భూముల రీసర్వే చేపట్టారు. ఇప్పుడు మిగిలిన 108 గ్రామాల్లో 20,774.63 ఎకరాలలో రీసర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ప్రతి మండలం నుంచి ఒక గ్రామం చొప్పున పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశారు చీడికాడ మండలంలో చీడికాడ, గొలుగొండ మండలంలో గుండుపాల, కోటవురట్ల మండలంలో చినబొడ్డేపల్లి, మాకవరపాలెం మండలంలో పైడిపాల, నర్సీపట్నం మండలంలో వేములపూడి, నాతవరం మండలంలో పీబీ అగ్రహారం, నక్కపల్లి మండలంలో గుల్లిపాడు, పాయకరావుపేట మండలంలో శ్రీరామపురం, రోలుగుంట మండలంలో రాజన్నపేట, ఎస్‌.రాయవరం మండలంలో కర్రివానిపాలెంతోపాటు రావికమతం, మాడుగుల మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి సర్వే పనులు ప్రారంభించారు.

గత ప్రభుత్వంలో లోపాలు

గత ప్రభుత్వంలో రీసర్వే తప్పుల తడకగా సాగింది. సర్వే సిబ్బంది క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహించారు. రైతు చూపించిన సరిహద్దులు కాకుండా ఇష్టానుసారం కొలిచారు. కొన్నిచోట్ల ఒకరి భూమిని మరొకరి పేరు మీద రాయడం, భూమి విస్తీర్ణం తగ్గించి నమోదు చేయడం వంటివి జరిగాయి. దీంతో రైతుల మధ్య వివాదాలు తలెత్తాయి. ఇవి పునరావృతం కాకుండా వుండేలా కూటమి ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

250 ఎకరాలకు ఒక బృందం ఏర్పాట

పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామంలో ప్రతి 250 ఎకరాలకు ఒక సర్వే టీమ్‌ను ఏర్పాటు చేశారు. సచివాలయ సర్వేయర్లు ఇద్దరు, ఒక వీఆర్‌వో, ఒక వీఆర్‌ఏ టీమ్‌లో ఉంటారు. సర్వే టీమ్‌కి సపోర్ట్‌గా వీఆర్‌వో, విలేజ్‌ సర్వేయర్‌ను అదనంగా నియమించారు. వీరు సర్వే పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తారు. గ్రామంలో సర్వేకి వెళ్లినప్పుడు రైతుకి నోటీసు అందజేస్తున్నారు రైతు నుంచి అవసరమైన సమాచారం తీసుకొని తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డుల ఆధారంగా రోలర్‌ మిషన్‌ సహాయంతో కొలుస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ నెలాఖరుకు సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే భూముల సరిహద్దు సమస్యల కారణంగా నెలాఖరుకు సర్వే పూర్తి కాకపోవచ్చునని అధికారులు అంటున్నారు. రీ సర్వేలో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి 91216 22335 ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచారు.

రీసర్వేకి రైతులు సహకరించాలి

ఎంఆర్‌పీ బాబు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే (11ఎన్‌పీ3)

పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల సర్వే పనులు గత నెల 20వ తేదీన ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం సర్వే పనులు చురుగ్గా, పక్కాగా జరుగుతున్నాయి. మ్యుటేషన్‌ అవ్వని భూములు ఏమైనా ఉంటే త్వరగతిన ఆన్‌లైన్‌ చేయించుకోవాలి. గ్రామాల్లో సర్వే సిబ్బందికి రైతులు సహకరించాలి.

Updated Date - Feb 12 , 2025 | 12:55 AM