మందకొడిగా పద్మాపురం గార్డెన్ పనులు
ABN , Publish Date - Jan 19 , 2025 | 10:56 PM
అందాల అరకులోయలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఆధునికీకరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ప్రకటించిన తేదీకి గార్డెన్‌ను అందుబాటులోకి తీసుకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యాటక సీజన్‌లో పనులు చేపట్టడంపై సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పండుగ వేళ అందుబాటులో లేకపోవడంతో పర్యాటకుల నిరాశ
సీజన్‌లో ఆధునికీకరణ పనులు చేపట్టడంపై పెదవివిరుపు
అరకులోయ, జనవరి 19(ఆంధ్రజ్యోతి): అందాల అరకులోయలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఆధునికీకరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ప్రకటించిన తేదీకి గార్డెన్‌ను అందుబాటులోకి తీసుకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యాటక సీజన్‌లో పనులు చేపట్టడంపై సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అరకులోయలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్‌లో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఈ నెల మూడో తేదీన మూసివేశారు. ఈ నెల 11వ తేదీ వరకు గార్డెన్‌లోకి సందర్శకులను అనుమతించడం లేదంటూ ఐటీడీఏ పీవో పేరిట ప్రధాన ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అధికారులు ప్రకటించిన తేదీ తర్వాత కూడా పద్మాపురం గార్డెన్ అందుబాటులోకి రాలేదు. గార్డెన్‌లో చేపట్టిన పనులు పూర్తికాలేదు. పనులు చేసే వారంతా పండుగలకు వెళ్లిపోవడంతో జాప్యం జరిగిందని మేనేజర్, ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అందువల్ల పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. శీతాకాలంలో అరకులోయ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అటువంటి సీజన్‌లో ఆధునికీకరణ పనులు చేపట్టడంపై పర్యాటకులు పెదవివిరుస్తున్నారు. అలాగే సంక్రాంతి పండుగ ముందు పనులు చేపట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆధునికీకరణ పనులు పర్యాటక సీజన్‌కు ముందుగా చేపడితే భారీగా ఆదాయం వచ్చేదని వారంటున్నారు. అయితే గార్డెన్‌లో పనులన్నీ పూర్తి చేసి, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా సిద్ధం చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేసి పర్యాటకులకు అనుమతించాలని నిర్ణయించినట్టు గార్డెన్ పర్యవేక్షకులు చెబుతున్నారు.