పద్మాపురం గార్డెన్‌కు సొబగులు
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:19 PM
స్థానిక పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఆధునికీకరణ తరువాత కొత్త సొబగులతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గార్డెన్‌లో లైటింగ్ పాత్‌వేలు, కెనోపి వాక్(ఉడెన్ బ్రిడ్జి), ట్రీ హట్స్, పూలతో ఓంకారం, త్రిశూలాన్ని తీర్చిదిద్దడం, వివిధ జంతువుల ప్రతిమలు, గిరిటేజ్ క్యాంటీన్, రాక్ ఫౌంటేన్, తదితర ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పర్యాటకులను ఆకర్షించేలా ఆధునికీకరణ పనులు
అలరిస్తున్న ట్రీ హట్స్, కెనోపి వాక్, లైటింగ్ పాత్‌వేలు
ప్రత్యేక ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్, జంతువుల ప్రతిమలు
గిరిటేజ్ క్యాంటీన్‌లో నోరూరించే వంటకాలు
సందర్శన వేళలు రాత్రి 10 గంటల వరకు మార్పు చేయడంతో పర్యాటకులకు వెసులుబాటు
అరకులోయ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఆధునికీకరణ తరువాత కొత్త సొబగులతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గార్డెన్‌లో లైటింగ్ పాత్‌వేలు, కెనోపి వాక్(ఉడెన్ బ్రిడ్జి), ట్రీ హట్స్, పూలతో ఓంకారం, త్రిశూలాన్ని తీర్చిదిద్దడం, వివిధ జంతువుల ప్రతిమలు, గిరిటేజ్ క్యాంటీన్, రాక్ ఫౌంటేన్, తదితర ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆధునికీకరణ అనంతరం పద్మాపురం గార్డెన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. సందర్శకులు గార్డెన్‌లో విడిది చేసేందుకు రోజ్ గార్డెన్‌కు ఎదురుగా ట్రీ హట్స్‌ను నిర్మించారు. పలు ప్రత్యేకతలు ఉన్న పండ్ల జాతి, జౌషధ గుణాలున్న మొక్కలు, వెదురు వనాలను ఆనుకొని కెనోపి వాక్‌కు అనుగుణంగా ఉడెన్ బ్రిడ్జి నిర్మించారు. రాక్ ఫౌంటేన్, రెడ్ ఆర్చ్‌లు, చిన్న పిల్లల పార్కు, భారీ వృక్షాల వేర్లతో కళాఖండాలు ఏర్పాటు చేశారు. అలాగే సందర్శకుల కోసం గిరిటేజ్ క్యాంటీన్ అందుబాటులో ఉంది. గార్డెన్‌ను కాలినడకన చూసేవారి కోసం, అలాగే టాయ్ ట్రైన్ ప్రయాణించే విధంగా సీసీ రోడ్లు, కాంక్రీట్ పాత్‌వేలు నిర్మించారు. గార్డెన్ సందర్శన వేళలు గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండేవి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు గార్డెన్‌ను సందర్శించడం వీలు కుదిరేది కాదు. అయితే ప్రస్తుతం సందర్శనీయ వేళలు మార్పు చేశారు. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం కల్పిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాత్రి వేళ గార్డెన్‌ను సందర్శకులు తిలకించేందుకు వీలుగా మూడు కిలో మీటర్ల పొడవున ఆర్ముడ్ కేబుల్, విద్యుద్దీపాలతో ఉన్న పాత్‌వేలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎక్కడికక్కడ సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. అక్కడక్కడ పగోడాలను నిర్మించారు. ఇటీవల బదిలీపై వెళ్లిన ఐటీడీఏ పీవో వి.అభిషేక్ అప్పట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రూ.2 కోట్ల వ్యయంతో నెల రోజుల పాటు గార్డెన్ ఆధునికీకరణ పనులు చేపట్టారు. అలాగే హాట్ ఎయిర్ బెలూన్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.
పెరిగిన టికెట్ల రేట్లు
గార్డెన్‌లో ప్రవేశానికి గత నెలాఖరు వరకు పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.30 టికెట్ రేట్లు ఉండేవి. అయితే ఆధునికీకరణ అనంతరం ఈ నెల ఒకటో తేదీ నుంచి పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50లుగా టికెట్ రేట్లు నిర్ణయించారు.
ట్రీ హట్ కాటేజీలో ఆరు సూట్‌లు
గార్డెన్‌లోని ట్రీ హట్ కాటేజీలో ఆరు సూట్‌లు ఉన్నాయి. ఒక్కో సూట్ అద్దె రూ.4,500 కాగా, అన్‌సీజన్‌లో రూ.2,500లు. ఇందులో పర్యాటకుల కోసం అన్ని వసతులు కల్పించారు. వీటిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
గార్డెన్‌లో గిరిటేజ్ క్యాంటీన్
గార్డెన్‌లో ట్రీ హట్స్‌లో బస చేసే వారి సౌకర్యార్థం, అలాగే సందర్శకుల కోసం ట్రీహట్స్, రోజ్ గార్డెన్, చిల్డ్రన్ పార్కుకు సమీపంలో గిరిటేజ్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఆర్డర్ ఇస్తే ఇక్కడ వంటకాలను సిద్ధం చేస్తారు. సాధారణ ఫుడ్‌ను అందుబాటులో ఉంచుతూనే ప్రత్యేకంగా ఏం కావాలన్నా వండుతారు.
ప్రత్యేక ఆకర్షణగా హాట్ ఎయిర్ బెలూన్
పద్మాపురం గార్డెన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. 300 మీటర్ల ఎత్తు వరకు పైకి బెలూన్‌లో విహరించి గార్డెన్ అందాలతో పాటు అరకులోయ పట్టణం, పరిసర ప్రాంత అందాలను తిలకించవచ్చు. ఈ హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించేందుకు రూ.1500లు చెల్లించాల్సి ఉంటుంది.