Share News

పాడేరు-భద్రాచలం బస్సు పునరుద్ధరణ

ABN , Publish Date - Feb 07 , 2025 | 10:10 PM

పాడేరు-భద్రాచలం బస్సు సర్వీసు గురువారం నుంచి పాడేరు ఆర్టీసీ అధికారులు పునరుద్ధరించారు.

పాడేరు-భద్రాచలం బస్సు పునరుద్ధరణ
పునరుద్ధరించిన పాడేరు డిపోకు చెందిన పాడేరు-భద్రాచలం సర్వీస్‌

భద్రాచలంలో బయలుదేరే వేళలు మార్చాలి

ఆర్టీసీ అధికారులకు వేడుకుంటున్న గిరిజనులు

సీలేరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పాడేరు-భద్రాచలం బస్సు సర్వీసు గురువారం నుంచి పాడేరు ఆర్టీసీ అధికారులు పునరుద్ధరించారు. గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీన వచ్చిన తుఫాన్‌కు జీకేవీధి నుంచి సీలేరు వరకు కొండచరియలు విరిగిపడడంతో బస్సు సర్వీసును అధికారులు రద్దు చేశారు. రహదారి పునరుద్ధరణ చేసినప్పటికీ బస్‌ సర్వీస్‌ను నడపకపోవడంతో చింతూరు, కూనవరం ప్రాంత ప్రయాణికులు పాడేరు-భద్రాచలం సర్వీస్‌ నడపాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు గురువారం నుంచి బస్‌ సర్వీస్‌ను పునరుద్ధరించారు. ఈ బస్సు పాడేరులో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి చింతపల్లి, గూడెంకొత్తవీధి, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం, చింతూరు, కూనవరం మీదుగా భద్రాచలం సాయంత్రం 5 గంటలకు చేరుతుంది. అదే సర్వీస్‌ రాత్రి 8.30 గంటలకు భద్రాచలంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు పాడేరు చేరుతుంది. అయితే భద్రాచలంలో బస్సు రాత్రి 8.30 గంటలకు కాకుండా మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు బయలుదేరినట్టు సమయం మార్పు చేయాలని సీలేరు, డొంకరాయి, మోతూగూడెం, ధారకొండ ప్రాంతాల ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ఈ విన్నపాన్ని మన్నించాలని గిరిజన ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Feb 07 , 2025 | 10:10 PM