Share News

పీ4 సర్వే ప్రారంభం

ABN , Publish Date - Mar 09 , 2025 | 01:13 AM

పేదరిక నిర్మూలనకు ప్రస్తుతం ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు అమలుచేస్తోంది.

పీ4 సర్వే ప్రారంభం

  • జిల్లాలో ఈ నెల 18 వరకూ నిర్వహణ

  • బాగా పేదరికంలో ఉన్న 20 శాతం కుటుంబాల గుర్తింపు

  • గ్రామ, వార్డు సభల్లో వివరాల వెల్లడి

  • అత్యంత పేదలకు అండగా నిలవడమే ధ్యేయం

  • ఇప్పటివరకూ అందుకుంటున్న సంక్షేమ పథకాలపై ఎటువంటి ప్రభావం చూపబోదన్న కలెక్టర్‌ స్పష్టీకరణ

విశాఖపట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):

పేదరిక నిర్మూలనకు ప్రస్తుతం ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు అమలుచేస్తోంది. అయితే పేదలను మరింత ఆదుకునేందుకు పీ4 సర్వే చేపట్టింది. ఈ సర్వే ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది అత్యంత పేదలకు గుర్తించనున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సాయం పొందుతున్న కుటుంబాల వివరాలు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్నాయి. వాటి ఆధారంగా జిల్లాలో శనివారం నుంచి పీ4 సర్వే ప్రారంభించారు. ఈనెల 18వ తేదీ వరకు చేపట్టనున్న సర్వేలో అత్యంత పేదలను గుర్తించేందుకు అవసరమైన వివరాలను సేకరిస్తారు. ఇందుకు 27 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకు ప్రత్యేకంగా యాప్‌ రూపొందించిన ప్రభుత్వం, సర్వే చేసే వార్డు/గ్రామ సచివాలయాల సిబ్బందికి అందుబాటులోకి తీసుకువచ్చింది.

జిల్లాలో ఏడు లక్షలకు పైచిలుకు ఉన్న కుటుంబాల వివరాలను ప్రభుత్వం ఇచ్చిన యాప్‌లో నమోదుచేసి అప్‌లోడ్‌ చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 5.29 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, పిల్లల చదువు కోసం అనేకమంది బియ్యం కార్డులు తీసుకున్నారు. పీ4 సర్వే చేసేటప్పుడు బియ్యం కార్డుదారులందరినీ కాకుండా వారిలో బాగా పేదరికంలో ఉన్న 20 శాతం కుటుంబాలనే ఎంపిక చేస్తారు. ఆ వివరాలను ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిల్లో సభలు ఏర్పాటుచేసి వెల్లడిస్తారు. తరువాత ఉగాది రోజున సీఎం చంద్రబాబునాయుడు పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమం ప్రారంభిస్తారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించి అత్యంత పేదలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చే ప్రణాళిక అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో చేపడుతున్న పీ4 సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ కోరారు. ఇప్పటివరకూ అందుకుంటున్న సంక్షేమ పథకాలపై ఈ సర్వే ఎటువంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టంచేశారు. సర్వేకు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను ఇందుకు నిర్దేశించిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలియజేయాలన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 01:13 AM