Share News

ఉక్కు యాజమాన్యం అత్యుత్సాహం

ABN , Publish Date - Feb 21 , 2025 | 01:11 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం తీరు మారడం లేదు. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి నష్టాలను కార్మికుల మీదకు నెట్టేస్తోంది. యాజమాన్యం వైఫల్యం వల్లనే స్టీల్‌ప్లాంటుకు ఈ దుస్థితి వచ్చిందని స్వయంగా విశాఖపట్నం ఎంపీనే ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు కూడా యాజమాన్యం అదే విధానంలో ముందుకు వెళుతోంది. మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ఆగస్టులో ప్రారంభించాలని కేంద్ర ఉక్కు శాఖా మంత్రి చెబితే...మార్చి నెలలోనే అందులో ఉత్పత్తికి ఆదరాబాదరాగా ఏర్పాట్లు చేస్తోంది. దానికి అవసరమైన ముడి సరకు కొనుగోళ్లలో వచ్చే కమీషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారనేది కార్మిక వర్గాల ఆరోపణ.

ఉక్కు యాజమాన్యం  అత్యుత్సాహం

మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్రారంభానికి తొందర

ఆగస్టులో ప్రారంభించాల్సిందిగా

కేంద్ర మంత్రి చెబితే...

మార్చి నెలాఖరులో ముహూర్తం

ముడిసరకుల కొనుగోళ్లలో కమీషన్ల కోసమేనా?

మరమ్మతులు పూర్తికాకుండా నడపడం ఎలా?

ఇంకా మారని ఉన్నతాధికారుల తీరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం తీరు మారడం లేదు. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి నష్టాలను కార్మికుల మీదకు నెట్టేస్తోంది. యాజమాన్యం వైఫల్యం వల్లనే స్టీల్‌ప్లాంటుకు ఈ దుస్థితి వచ్చిందని స్వయంగా విశాఖపట్నం ఎంపీనే ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు కూడా యాజమాన్యం అదే విధానంలో ముందుకు వెళుతోంది. మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ఆగస్టులో ప్రారంభించాలని కేంద్ర ఉక్కు శాఖా మంత్రి చెబితే...మార్చి నెలలోనే అందులో ఉత్పత్తికి ఆదరాబాదరాగా ఏర్పాట్లు చేస్తోంది. దానికి అవసరమైన ముడి సరకు కొనుగోళ్లలో వచ్చే కమీషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారనేది కార్మిక వర్గాల ఆరోపణ.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో ప్రస్తుతం రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు మాత్రమే నడుస్తున్న సంగతి తెలిసిందే. ముడి సరకుల కొనుగోలుకు అవసరమైన నిధులు లేకపోవడం వల్లనే మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను చాలాకాలంగా ఆపేశారు. గతంలో సీఎండీగా పనిచేసిన అతుల్‌ భట్‌ కూడా నామమాత్రపు పనులతో 2023 డిసెంబరులో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను ప్రారంభించి మూడు నెలలు నడిపి ఆ తరువాత మళ్లీ మూసేశారు. సరైన నిర్వహణ పనులు చేపట్టకుండా ఉత్పత్తి ప్రారంభించడం వల్ల అందులో కూలింగ్‌ ప్లేట్లు పాడైపోయాయి. కొత్తవి తెప్పించి అమర్చి, ఆ తరువాత మిగిలిన నిర్వహణ పనులన్నీ పూర్తిచేస్తే తప్ప అందులో ఉత్పత్తి మొదలు పెట్టడం సాధ్యం కాదు. ఇవన్నీ చేయాల్సి ఉందనే కారణంతోనే ఆగస్టులో దానిని ప్రారంభించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పారు. అయితే ఇక్కడే యాజమాన్యం సొంత ఆసక్తి బయటపడింది. ప్రస్తుత సీఎండీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సీఎండీగా శక్తిమణిని కమిటీ ఇప్పటికే ఎంపిక చేసింది. ఆయన ఏప్రిల్‌లో ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. ఈలోగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను ప్రారంభించేసి, దానికి అవసరమైన కోక్‌, పెల్లెట్లను వేల టన్నుల్లో కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభించాల్సి ఉండగా, మార్చి నెలాఖరు నాటికే ఉత్పత్తికి సిద్ధం చేస్తున్నారు. కూలింగ్‌ ప్లేట్లు కొత్తవి చైనా నుంచి తెప్పిస్తున్నట్టు తెలిసింది. అవి అమర్చేసి, ఉత్పత్తి ప్రారంభించాలని అనుకుంటున్నారు. మిగిలిన నిర్వహణ పనులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ విధంగా చేస్తేమూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3లో మళ్లీ పెద్ద సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరమ్మతులు చేయడానికి వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంటున్నాయి. కార్మికులే సరిగ్గా నడపలేక దానిని పాడు చేశారని యాజమాన్యం ప్రచారం చేసే అవకాశం కూడా లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఇంకా సిద్ధం కాక ముందే దానికి అవసరం అంటూ 25 వేల టన్నుల పెల్లెట్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చేశారు. టన్ను రూ.13 వేలు చొప్పున కొంటున్నారు. ఇంకో వైపు కోక్‌ 50 వేల టన్నులు కావాలంటూ టెండర్‌ ప్రకటన జారీచేశారు. వీటి కొనుగోళ్లలో వచ్చే కమీషన్‌ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే ఎంపీలు, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఇందులో జోక్యం చేసుకొని ముందు బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3కి మరమ్మతులు జరిగేలా చూడాలని, ఆ తరువాతే ముడి సరకుల కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని యాజమాన్యాన్ని హెచ్చరించాల్సిన ఆవశ్యకత ఉంది.

7న కాంట్రాక్టు కార్మికుల సమ్మె

స్టీల్‌ప్లాంటు యాజమాన్యానికి నోటీస్‌

ఉక్కుటౌన్‌షిప్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి 7న సమ్మె చేపట్టేందుకు స్టీల్‌ ప్లాంటు కాంట్రాక్టు కార్మికులు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు ర్యాలీగా వెళ్లి యాజమాన్యానికి సమ్మె నోటీస్‌ అందజేశారు. ప్లాంటులో ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని తొలగించరాదని, టెండర్‌లు ముగిసిన కాంట్రాక్టర్‌ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి కల్పించాలని, పాత పద్ధతిలోనే గేటుపాస్‌లు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ చెల్లింపులో సమస్యలు లేకుండా చూడాలనే డిమాండ్‌లతో సమ్మె చేపట్టనున్నట్టు నోటీస్‌లో పేర్కొన్నారు. ర్యాలీలో అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు మంత్రి రవి, జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, కృష్ణా, అప్పారావు, తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 01:11 AM