కిక్కిరిసిన రైళ్లు
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:51 AM
సంక్రాంతి ప్రయాణాలు ఊపందుకున్నాయి.

ఇటు భువనేశ్వర్, అటు సికింద్రాబాద్...
ఎటువైపు వెళ్లే రైలు చూసినా అదే పరిస్థితి
స్టేషన్‌లో జాతర వాతావరణం
ఊపందుకున్న పండుగ ప్రయాణాలు
నేడు సింహాద్రి రద్దు
జన్మభూమి, రత్నాచల్‌లకు పెరగనున్న తాకిడి
విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి ప్రయాణాలు ఊపందుకున్నాయి. విద్యాలయాలతోపాటు దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఆదివారం నుంచి సెలవులు కావడంతో చాలామంది శనివారం కుటుంబ సమేతంగా స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో భువనేశ్వర్, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, చెన్నై ప్రాంతాల వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లతోపాటు విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస, నౌపడ, రాయగడ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే పాసింజర్ రైళ్లు రద్దీగా మారాయి. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి విశాఖ, విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చేవారితో శనివారం రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.
ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రద్దీ
శనివారం విశాఖ నుంచి బయలుదేరిన, ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా నడిచిన రైళ్లు జనంతో కిక్కిరిశాయి. గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాయగడ (17243), రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717)లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ వచ్చాయి. అలాగే విశాఖ నుంచి విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్, విశాఖ, తిరుమల, గోదావరి, గరీబ్‌రధ్, ఎల్‌టీటీ, మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా అలాగే వెళ్లాయి.
కిక్కిరిసిన పాసింజర్ రైళ్లు
విశాఖ నుంచి ఉత్తరాంధ్రలోని కొత్తవలస, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్డు, తిలారు, కోటబొమ్మాలి, నౌపడా, పలాస, మందస, సోంపేట, ఇచ్చాపురం వంటి ప్రాంతాలకు వెళ్లేవారిలో అత్యధికులు రైళ్లను ఆశ్రయించాయి. దీంతో విశాఖ-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ (22820), గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243) రైళ్లతోపాటు విశాఖ-భవానీపట్న (58504), విశాఖ-బ్రహ్మపూర్ (58532), విశాఖ-పార్వతీపురం పాసింజర్ (67287), విశాఖ-కోరాపుట్ (58538), విశాఖ-గునుపూర్ (58506), విశాఖ-రాయపూర్ (58528) పాసింజర్ రైళ్లు రద్దీగా నడిచాయి.
నేడు సింహాద్రి ఎక్ప్‌ప్రెస్ రద్దు ప్రభావం
విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240)ను ఆదివారం రద్దు చేయడంతో ఆ ప్రభావం జన్మభూమి (12805), రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717)లపై పడే అవకాశం ఉంది. అయితే ఆదివారం ఉదయం 8.00 గంటలకు విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక జనసాధారణ్ రైలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రయాణికులకు కొంత ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయి.
బస్ కాంప్లెక్స్‌లలోనూ...
468 స్పెషల్స్ నడిపిన ఆర్టీసీ
ద్వారకా కాంప్లెక్స్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి ప్రయాణికుల రాకపోకలతో శనివారం ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్, మద్దిలపాలెం బస్ స్టేషన్ కిటకిటలాడాయి. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు దూర ప్రాంతాలకు 138, జోనల్ పరిధిలోని ప్రాంతాలకు 330 ప్రత్యేక సర్వీస్‌లు ఆపరేట్ చేశారు. హైదరాబాద్ 25, విజయవాడ 45, రాజమండ్రి 30, కాకినాడ 30, భీమవరం 4, అమలాపురం 4 ప్రత్యేక సర్వీసులు నడిపారు. అలాగే జోన్ పరిధిలోని శ్రీకాకుళం 100, విజయనగరం 50, పార్వతీపురం 50, పాలకొండ 30, పలాస 50, టెక్కలి 20, సోంపేట 20, ఇచ్ఛాపురం 10 ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేశారు. ప్రయాణికుల డిమాండ్ ఉంటే రాత్రికి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతామని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రకటించారు. ఆదివారం కూడా ఇదేవిధంగా డిమాండ్ ఉండే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా బస్సులు సమకూర్చుకుంటున్నామని ఆయన తెలిపారు.