సేంద్రీయ ఉత్పత్తుల సంత
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:06 AM
ఆహారం పొలం నుంచి ప్యాకింగ్ వరకూ కల్తీ జరుగుతోంది. వాటిని తిని చాలా మంది చిన్న వయస్సులోనే అనారోగ్యానికి గురవుతున్నారు.

ప్రతి ఆదివారం వసంతబాల స్కూల్ ఆవరణలో నిర్వహణ
మిషన్...ఫామ్ టూ ఫ్యామిలీ
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిటైర్డ్ రీజనల్ డైరెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు
మూడు వారాల క్రితం ప్రారంభం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆహారం పొలం నుంచి ప్యాకింగ్ వరకూ కల్తీ జరుగుతోంది. వాటిని తిని చాలా మంది చిన్న వయస్సులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. కల్తీ లేని కూరగాయలు, ఇంట్లో వండిన పదార్థాలనే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దాంతో చాలామంది రసాయనాలు వినియోగించకుండా పండించిన ఆర్గానిక్ (సేంద్రీయ) ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నారు. ఇటువంటి వారి కోసం గురుద్వారా దగ్గరున్న వసంతబాల స్కూల్ ఆవరణలో ప్రతి ఆదివారం ‘సేంద్రీయ సంత’ నిర్వహిస్తున్నారు. మూడు వారాలుగా జరుగుతున్న ఈ సంతకు ఆదరణ బాగుంది. ఇక్కడ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, నూనెలు అన్నీ లభిస్తున్నాయి.
హాబీగా మొదలై...
సేంద్రీయ సంత నిర్వహిస్తున్న సంధ్య బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో రీజనల్ డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఆరోగ్య సమస్యల వల్ల రాజీనామా చేశారు. మధురవాడలో ఉంటున్న ఆమె మేడపై కూరగాయలు పండించేవారు. ఇంట్లో వాడగా మిగిలినవి తెలిసిన వారికి పంచేవారు. ఇంకా మిగిలిపోయినవి మధురవాడ పరిసరాల్లో జరిగే సంతల్లో విక్రయించేవారు. అక్కడకు వచ్చే రైతులతో మాట్లాడితే...తాము కూడా సేంద్రీయ వ్యవసాయమే చేస్తున్నామని, మార్కెటింగ్ ఇబ్బందిగా ఉందని చెప్పడంతో సొంతంగా ఓ బజార్‌ను నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. గురుద్వారా వద్ద ఉన్న వసంతబాల స్కూల్‌లో చదువుకున్న ఆమె తన తోటి సహాధ్యాయులతో ఈ విషయం చెప్పారు. ఆ స్కూల్ ఆవరణలోనే ప్రతి ఆదివారం సంత ఏర్పాటుచేసి ఉత్పత్తులు విక్రయిస్తే బాగుంటుందని అందరూ సలహా ఇచ్చారు. యాజమాన్యం అంగీకరించడంతో గత మూడు వారాల నుంచి సంత నిర్వహిస్తున్నారు. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గానుగ నూనెలు, వాటితో తయారుచేసిన ఆహార పదార్థాలు, హెర్బల్ ఉత్పత్తులు అన్నీ అమ్మడం ప్రారంభించారు. ఆదరణ బాగుండడంతో ఇతర రైతులు కూడా రావడానికి ఆసక్తి చూపుతున్నారు.
సీజన్‌లో ఉపయోగకరం
సంధ్య, సంత నిర్వాహకులు
సాధారణంగా జూలై నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సీజన్ మొదలవుతుంది. పంట ఎక్కువ వస్తుంది. వాటిని విక్రయించడం సమస్య. అటువంటి వాటికి పరిష్కారంగా ఈ సంతను పెడుతున్నాం. వారానికి రెండుసార్లు పెట్టాలనే యోచన ఉంది. రాబోయేది వేసవి. మామిడి పండ్లు బాగా వస్తాయి. మ్యాంగో మేళా పేరుతో సంత పెట్టాలనుకుంటున్నాము. పండ్లతో పాటు ఆవకాయ పెట్టుకోవడానికి అవసరమైనవి అన్నీ అందుబాటులో ఉంచుతాము. రైతులకు, కొనుగోలుదారులకు బాగుంటుంది.
20 సెంట్లలో సాగు
మూర్తిరాజు, పరదేశిపాలెం
నేను కూడా ఉద్యోగం చేసి అనారోగ్య కారణాలతో మానేశాను. 20 సెంట్ల భూమిలో కూరగాయలు పండిస్తున్నా. సుభాష్ పాలేకర్ సూచించిన ఐదు లేయర్ల విధానంలో సాగు చేస్తున్నాము. రైతుబజార్ రేట్ల కంటే కిలోకు పది నుంచి ఇరవై రూపాయలు ధర ఎక్కువగా ఉంటుంది. మాకు కూడా పది నుంచి 20 శాతం లాభం వస్తుంది. ఎరువులు వాడని ఉత్పత్తుల వల్ల ఎటువంటి వ్యాధులు రావు.
పది ఎకరాల్లో పంటలు
సునీత, వేపాడ
వేపాడ మండలంలో పది ఎకరాల భూమిలో కుటుంబం అంతా కలిసి వ్యవసాయం చేస్తున్నాము. ఆవులు కూడా ఉన్నాయి. నువ్వులు, వేరుశెనగలు పండించి గానుగ ఆడుతాం. తాజా నూనెలు తయారు చేస్తాం. వాటితో అప్పటికప్పుడు తినుబండారాలు తయారుచేసి తెస్తాం. కాసింత దూరమైనా అమ్మకాలు బాగుండడం వల్ల ఇక్కడికి వచ్చి విక్రయిస్తున్నాము.