Share News

కొండలపై భూమి నూరుశాతం వినియోగం

ABN , Publish Date - Feb 11 , 2025 | 01:12 AM

విశాఖపట్నంలో కొండలపై భూములను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కొండలపై భూమి నూరుశాతం వినియోగం

  • రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

  • ముంబై తరహాలో ఉపయోగించుకోవాలని యోచన

  • త్వరలో అధ్యయనానికి అధికారుల బృందం

  • మధురవాడ ఐటీ హిల్స్‌లో అదనపు అంతస్థుల నిర్మాణానికి అనుమతులు, రాయితీలు

  • 33 శాతం వాణిజ్య అవసరాలుగా మార్చుకోవడానికి పాలసీలో మార్పులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో కొండలపై భూములను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముంబైలో కొండలను వంద శాతం సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ అలా లేదు. ఐటీ సంస్థలకు కొండలపై ఎకరాల కొద్దీ భూమి కేటాయిస్తే చిన్న చిన్న భవనాలు నిర్మించి ‘మమ’ అనిపిస్తున్నారు. భూ కేటాయింపులు ఎక్కువ, ఉద్యోగులు తక్కువ...అన్నట్టు పరిస్థితి ఉంది. దీనిలో మార్పు తీసుకురావాలని పరిశ్రమల శాఖ యత్నిస్తోంది. ఇప్పటికే భూములు పొంది భవనాలు నిర్మించినవారు అదనపు అంతస్థులు నిర్మిస్తే రాయితీలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీలో ప్రకటించింది. 33 శాతం వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవచ్చునని ప్రకటించింది.

కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో ప్రభుత్వ భూములకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అనేక ఐటీ కంపెనీలు, పర్యాటక సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకువస్తున్నాయి. గూగుల్‌ సంస్థ సాధారణ కార్యాలయంతో పాటు డేటా సెంటర్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇన్ఫోసిస్‌కు రెండు ఎకరాల స్థలం ఉంది. క్యాంపస్‌ ఏర్పాటుకు ఇంకా భూమి అవసరమని చెబుతోంది. టీసీఎస్‌ ప్రస్తుతం మిలీనియం టవర్స్‌లో కార్యకలాపాలకు ముందుకు వచ్చినా శాశ్వత క్యాపంస్‌కు భూమి కావాలని అడుగోతంది. ఇటీవల విశాఖలో పర్యాటక శాఖ నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో ప్రముఖ సంస్థలు భూమి ఇస్తే ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విశాఖలో కొండలు, అక్కడున్న భూములను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చునో ప్రణాళిక రూపొందించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. దీనికి ముందు ముంబైకు వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీలకు చెందిన ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని పంపించి అధ్యయనం చేసి రావాలని ఆదేశించింది.

మధురవాడలోనే అధికం

మధురవాడ-రుషికొండలను కలుపుతూ ఉన్న నాలుగు కొండలను ఏపీఐఐసీ ఐటీ ఆర్థిక మండళ్లుగా ప్రకటించింది. వాటిపై ఐటీ సంస్థలకు రెండు దశాబ్దాల క్రితం నుంచి భూములు కేటాయిస్తూ వస్తోంది.

- హిల్‌ నంబరు 1లో రెండు కంపెనీలకు స్థలాలు కేటాయించారు. మిరాకిల్‌ కంపెనీకి 5 ఎకరాలు ఇవ్వగా, మరో కంపెనీ ఫ్లూయెంట్‌ గ్రిడ్‌కు రెండు ఎకరాలు కేటాయించారు. రెండింటిలోను వేయి మంది పనిచేస్తున్నారు.

- హిల్‌ నంబరు 2లో 14 కంపెనీలకు 25 ఎకరాలు కేటాయించారు. సింబియోసిస్‌ టెక్నాలజీస్‌, కలర్‌ చిప్స్‌, సాఫ్ట్‌ సోల్‌, న్యూనెట్‌, సాంఖ్య టెక్నాలజీస్‌, మహతి సాఫ్ట్‌వేర్‌ (ఫిన్‌టెక్‌ వ్యాలీ), నవయుగ ఇన్ఫోటెక్‌, ఏసీ ఇన్ఫోటెక్‌, నోవిటాస్‌, క్లోవ్‌ టెక్నాలజీస్‌, సీఈఎస్‌, మైటెక్‌ తదితర కంపెనీలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

- హిల్‌ నంబరు 3లో 90 ఎకరాల స్థలం ఉంది. అందులో కెనెక్సాకు 25 ఎకరాలు కేటాయించగా, ఆ సంస్థను ఐబీఎం టేకోవర్‌ చేసింది. కేవలం నాలుగు ఎకరాలు తమకు చాలని, మిగిలిన 21 ఎకరాలు వెనక్కి ఇచ్చేసింది. ఇది కాకుండా మరో 13 కంపెనీల (విప్రో, ఈ సెంట్రిక్‌, ఐఐసీ టెక్‌, వినో సాఫ్ట్‌, ఐఐసీ సిస్టమ్స్‌, వరల్డ్‌ టెక్‌, మెటామైండ్‌, సిఫీ, జెనోసాఫ్ట్‌)కు ఎకరా నుంచి తొమ్మిది ఎకరాల వరకు కేటాయించారు. ఈ కొండపైనే స్టార్టప్‌ విలేజ్‌, మిలీనియం టవర్‌-1, టవర్‌-2లు ఉన్నాయి. ఈ కొండపై ప్రైవేటు కంపెనీల్లో నాలుగు వేల మంది వరకు పనిచేస్తున్నారు.

- హిల్‌ నంబరు 4 మొత్తం 276.77 ఎకరాలు అదానీ డేటా సెంటర్‌కు కేటాయించారు.

- కాపులుప్పాడలో గతంలో లోకేశ్‌ ఐటీ మంత్రిగా పనిచేసినప్పుడే 170 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారు. ఇప్పటికీ ఎవరికీ కేటాయించలేదు.

...ఇవి కాకుండా మంగమారిపేటలో చినజీయరు స్వామికి, వైసీపీ ప్రభుత్వం భీమిలి సమీపాన శారదా పీఠానికి భూములు కేటాయించాయి. వీటికి ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. రహదారి ఎక్కడి నుంచి వేయాలి?, భూమిని ఎలా ఉపయోగించాలనే దానిపై స్పష్టత లేదు. వీటిపై కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టిపెట్టింది.

పాలసీలో మంచి రాయితీలు

ఓ.నరేశ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు, రుషికొండ ఐటీ పార్క్‌ అసోసియేషన్‌

కూటమి ప్రభుత్వం కొత్త ఐటీ పాలసీలో ఐటీ కంపెనీలకు రాయితీలు ప్రకటించింది. గతంలో నిర్దేశించిన విస్తీర్ణం కంటే ఎక్కువ నిర్మిస్తే చదరపు అడుగుకు రూ.2 వేలు రాయితీ వస్తుంది. ఇది పూర్తిగా ఆర్థిక మండలి. అయినా సరే ఉద్యోగులకు ఇళ్లు, వ్యాపార కార్యకలాపాలకు కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అనుమతి ఇస్తామని చెప్పింది. అయితే వాటికి రాయితీలు ఉండవు. ఎకరాల కొద్దీ భూమిని తీసుకున్నవారు ఇంకా రెట్టింపు సంఖ్యలో ఉద్యోగులకు అవకాశం కల్పించాలనేదే ప్రభుత్వ ధ్యేయం.

Updated Date - Feb 11 , 2025 | 01:12 AM