ప్యాకేజీతో స్టీల్‌ప్లాంటుకు నూతనశక్తి
ABN , Publish Date - Jan 19 , 2025 | 01:34 AM
విశాఖ ఉక్కు కర్మాగారం సత్తా ఏంటో దేశానికి చూపించాల్సిన సమయం వచ్చిందని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు.
ఉక్కు సత్తా ఏమిటో దేశానికి చూపాల్సిన సమయం వచ్చింది
సంస్థాగతంగా సమూల మార్పులు తీసుకువచ్చేలా కృషిచేస్తా
కీలక పోస్టుల్లో సమర్థులను నియమించాల్సిన అవసరం ఉంది
ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేశ్‌లకు ధన్యవాదాలు
ఎంపీ ఎం.శ్రీభరత్
విశాఖపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉక్కు కర్మాగారం సత్తా ఏంటో దేశానికి చూపించాల్సిన సమయం వచ్చిందని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. స్టీల్‌ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 11,440 కోట్లు ప్యాకేజీని సద్వినియోగం చేసుకునేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల తరువాత మరోసారి సహకారం కోసం వేచి చూసే పరిస్థితి రాకూడదన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్యాకేజీకి పదింతలు భవిష్యత్తులో తిరిగి దేశానికి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్యాకేజీ ద్వారా ప్లాంటు కార్యకలాపాలకు నూతనశక్తి వస్తుందన్నారు. గతంలో వాజపేయి హయాంలో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, దివంగత ఎర్రన్నాయుడు, విశాఖ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కలిసి ప్లాంటును కాపాడారని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడు, భారత ప్రధాని నరేంద్రమోదీ, నిర్మలాసీతారామన్, కుమార్‌స్వామితో చర్చించడంతో రివైవల్ ప్యాకేజీ ప్రకటించారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సంస్థాగతంగా సమూల మార్పులు తీసుకువచ్చేలా, ఆ దిశగా ఉక్కు మంత్రిత్వశాఖ ముందడుగు వేసేలా స్థానిక ఎంపీగా బాధ్యత తీసుకుంటానని శ్రీభరత్ అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉక్కు కర్మాగారం రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి అభ్యర్థిగా తాను ఇచ్చిన ఏడు హామీల్లో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూస్తానన్నది ఒకటని శ్రీభరత్ పేర్కొన్నారు. దానికి కట్టుబడి లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన వెంటనే కేంద్ర ఉక్కుమంత్రి కుమార్‌స్వామి వద్దకు వెళ్లి కర్మాగారం గురించి వివరించానన్నారు. ఇంకా పలు సందర్భాలలో కేంద్ర మంత్రులను కలిసినపుడు ఇక్కడ పరిస్థితి వివరించి కర్మాగార కార్మికులకు భరోసా కల్పిస్తూ వచ్చానన్నారు. కర్మాగారంలో కీలక పోస్టుల్లో సమర్థులను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర క్యాబినెట్‌ను ఒప్పించి ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి శ్రీభరత్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, నారా లోకేశ్, కూటమి నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు గండి బాబ్జీ, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.