ఉక్కు ఉద్యోగులకు జీతాలపై చర్చలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:16 AM
ఉద్యోగులు, కార్మికులకు జీతాల చెల్లింపుపై విశాఖపట్నం స్టీల్ ప్లాంటు (ఆర్‌ఐఎన్‌ఎల్) యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకుండా నీళ్లు నమిలింది.

రీజనల్ లేబర్ కమిషనర్ వద్ద నోరు మెదపని ప్రతినిధులు
సమ్మెకు దిగాల్సి ఉంటుందని సీఐటీయూ హెచ్చరిక
విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):
ఉద్యోగులు, కార్మికులకు జీతాల చెల్లింపుపై విశాఖపట్నం స్టీల్ ప్లాంటు (ఆర్‌ఐఎన్‌ఎల్) యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకుండా నీళ్లు నమిలింది. దీంతో సీఐటీయూ ప్రతినిధులు వచ్చే నెలలో సమ్మె తప్పదని స్పష్టంచేశారు. ఆరు నెలలుగా పూర్తి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ సీఐటీయూ నాయకులు అక్కయ్యపాలెంలోని కేంద్ర రీజనల్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇరు వర్గాలను మంగళవారం చర్చలకు పిలిచారు. యాజమాన్యం తరఫున ఫైనాన్స్ డీజీఎం ఎస్.రాంప్రసాద్, హెచ్‌ఆర్ మేనేజర్ వైహెచ్ శంకర్, సీఐటీయూ తరఫున ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, అయోధ్యరామ్ పాల్గొన్నారు. డిసెంబరు 2024 నుంచి ఇప్పటివరకూ స్టీల్ అమ్మకాల ద్వారా రూ.6,200 కోట్ల ఆదాయం వచ్చిందని, అయినా జీతాలు అరకొరగా ఇస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. దీనిపై యాజమాన్య ప్రతినిధులను రీజనల్ లేబర్ కమిషనర్ ప్రశ్నిస్తే వారు సరైన జవాబు ఇవ్వలేదు. యాజమాన్యం దృష్టికి తీసుకువెళతామన్నారు. తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రీజనల్ కమిషనర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, ఇంతవరకూ శాంతియుతంగా పోరాటం చేశామని, దీనిని యాజమాన్యం అసమర్థతగా భావిస్తోందన్నారు. మార్చి 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని స్పష్టంచేశారు. ఈ విషయంలో కార్మికులు అందరినీ కలుపుకొని వెళతామని అయోధ్యరామ్ వెల్లడించారు.