Share News

నేడు నేవీ విన్యాసాలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:58 AM

తూర్పు నౌకాదళం శనివారం సాయంత్రం రామకృష్ణా బీచ్‌లో సాహస విన్యాసాల ప్రదర్శన (ఆపరేషన్‌ డెమో) నిర్వహించనుంది.

నేడు నేవీ విన్యాసాలు

  • ఆర్కే బీచ్‌లో ఆపరేషన్‌ డెమో

  • ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

  • కుటుంబ సమేతంగా హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

విశాఖపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):

తూర్పు నౌకాదళం శనివారం సాయంత్రం రామకృష్ణా బీచ్‌లో సాహస విన్యాసాల ప్రదర్శన (ఆపరేషన్‌ డెమో) నిర్వహించనుంది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఏటా డిసెంబరు 4న నేవీ డే నిర్వహించి, అదేరోజు సాయంత్రం బీచ్‌లో సాహస విన్యాసాలు ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి (2024) ఈ విన్యాసాలను ఒడిశా రాష్ట్రంలోని పూరీ బీచ్‌లో నిర్వహించగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు. విశాఖ ప్రజల కోసం నేవీ అధికారులు శనివారం ఆర్‌కే బీచ్‌లో ప్రదర్శన ఏర్పాటుచేశారు. దీనికి సీఎంను ఆహ్వానించారు. ఆయన శనివారం మధ్యాహ్నం 2.40 గంటలకు హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో బయలుదేరి 3.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి 4.40 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుంటారు. 6.10 గంటల వరకు నేవీ విన్యాసాలు వీక్షిస్తారు. తిరిగి బీచ్‌ నుంచి 6.15 గంటలకు బయలుదేరి 6.50 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళతారు.

సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులతో రాక

నేవీ ఆపరేషన్‌ డెమోకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, ఆయన సతీమణి, పిల్లలు రానున్నారు. ఇంకా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం రాత్రే నగరానికి చేరుకున్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:58 AM