Share News

నాలా పన్ను బకాయిలు రూ.930 కోట్లు

ABN , Publish Date - Feb 21 , 2025 | 01:13 AM

జిల్లాలో నాలా (నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌) పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించుకోవాలంటే నాలా పన్ను చెల్లించాలి.

నాలా పన్ను బకాయిలు రూ.930 కోట్లు

విశాఖ డివిజన్‌లో రూ.870 కోట్లు, భీమిలి డివిజన్‌లో రూ.60 కోట్లు

మెడటెక్‌ జోన్‌ చెల్లించాల్సింది రూ.786 కోట్లు

బకాయిదారుల జాబితాలో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు,

భవన నిర్మాణ సంస్థలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో నాలా (నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌) పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించుకోవాలంటే నాలా పన్ను చెల్లించాలి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో నాలా పన్ను బకాయిలు రూ.930 కోట్లు వరకూ ఉన్నాయి. విశాఖ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రూ.876.05 కోట్లు, భీమిలి డివిజన్‌లో రూ.60 కోట్ల వరకూ రావలసి ఉన్నట్టు గుర్తించారు. విశాఖపట్నం రెవెన్యూ డివిజన్‌లో 540 ఎకరాలకు సంబంధించి 120 మంది వ్యక్తులు/సంస్థలు/కంపెనీలు నాలా పన్ను చెల్లించాల్సి ఉంది. డివిజన్‌లో మొత్తం బకాయిలో 84 శాతం...అంటే సుమారు రూ.786.14 కోట్లు పెదగంట్యాడ మండలం నడుపూరులో 270.71 ఎకరాల్లో నెలకొల్పిన మెడ్‌టెక్‌ జోన్‌ యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. వాస్తవంగా మెడ్‌టెక్‌ జోన్‌ బకాయి రూ.390 కోట్లు ఉండగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులకు సదరు యాజమాన్యం స్పందించలేదు. దీంతో 100 శాతం పెనాల్టీ విధించడంతో బకాయి రూ.786.14 కోట్లకు చేరింది. కాగా మిగిలిన బకాయిదారుల్లో చిన్న వ్యాపార సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, భవన నిర్మాణ సంస్థలు ఉన్నాయి. భీమిలి డివిజన్‌లో రూ.60 కోట్లు రావలసి ఉంది. బకాయిల వసూళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నోటీసులు జారీచేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టే యోచనలో యంత్రాంగం ఉంది.

నాలా పన్ను ఐదు శాతం

వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోవాలంటే ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్‌ విలువలో ఐదు శాతం నాలా పన్ను కింద చెల్లించాలి. స్థానిక సంస్థలు అంటే జీవీఎంసీ, గ్రామ పంచాయతీల అధికారులు ఆయా వ్యక్తులు/సంస్థలకు పలు రకాల అవసరాలకు అనుమతి ఇచ్చేముందే నాలా పన్ను చెల్లించారా?, లేదా?...అనేది తప్పనిసరిగా పరిశీలించాలి. కానీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, భవన నిర్మాణదారులతో కుమ్మక్కై చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.

Updated Date - Feb 21 , 2025 | 01:13 AM