వచ్చే నెల మొదటి వారంలో మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవనం ప్రారంభం
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:30 AM
సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ రూ.80 కోట్లతో నిర్మిస్తున్న మల్టీ లెవెల్ కారు పార్కింగ్/కమర్షియల్ కాంప్లెక్స్ భవనం పనులను ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ ఆదేశించారు.

నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
వీఎంఆర్‌డీఏ కమిషనర్ విశ్వనాథన్
విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ రూ.80 కోట్లతో నిర్మిస్తున్న మల్టీ లెవెల్ కారు పార్కింగ్/కమర్షియల్ కాంప్లెక్స్ భవనం పనులను ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ ఆదేశించారు. ఆయన ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి శుక్రవారం భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రతి అంతస్థూ తిరిగి పనులు ఎక్కడెక్కడ అసంపూర్తిగా ఉన్నాయో గుర్తించారు. అవసరమైతే ఎక్కువ మంది పనివారిని పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో నెలాఖరుకు నిర్మాణం పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. ఇదే అంశంపై సోమవారం సమీక్షిస్తామని, కాంట్రాక్టర్‌కు తెలిపారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ భవానీశంకర్, ఎస్‌ఈ బలరామరాజు, ఈఈలు మధుసూదన్, రామరాజు, తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------------------------
శివారుల్లో మంచు, చలి
విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
నగర శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం దట్టంగా మంచు కురిసింది. తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకూ మంచు కొనసాగింది. దీంతో ఉదయం పూట వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా మంచు, ఉదయం మేఘాలు ఆవరించడంతో చలి పెరిగింది. నగరంతో పోల్చితే శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. రెండు, మూడు రోజుల తరువాత చలి మరికాస్త పెరుగుతుందన్నారు.
---------------------------------------------------------------------
నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం
స్థాయీ సంఘ సమావేశాలు కూడా...
విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సవరణ, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ ఆమోదం కోసం శనివారం ఉదయం 10.30 గంటలకు చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. అంతకు ముందు ఉదయం తొమ్మిది నుంచి 10.30 గంటల వరకు స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయన్నారు. తొలుత స్థాయీ సంఘ సమావేశాల్లో సవరించిన, అంచనా బడ్జెట్‌లు ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం తీసుకుని తరువాత సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. సభ్యులు ఈ సమావేశాలకు హాజరుకావాలని కోరారు.