Share News

సుజల స్రవంతి పనులకు కదలిక

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:54 AM

ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి అయిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి భూసేకరణ పనులను వేగవతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సుజల స్రవంతి పనులకు కదలిక
ఎలమంచిలి నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అనుసంధానం చేయాల్సిన పోలవరం కాలువ

- బడ్జెట్‌లో రూ.605.75 కోట్లు కేటాయింపు

- భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశం

- ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి అయిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి భూసేకరణ పనులను వేగవతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రెండు దశల్లో చేపట్టేందుకు రూ.2,022 కోట్ల వ్యయంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం తప్ప, నిధులు విడుదల చేయలేదు. ఫలితంగా పనులు ముందుకు సాగకపోగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.17 వేల కోట్లకు పెరిగిపోయింది. వాస్తవానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయిన తరువాత ఆ కాలువ చివరి 162వ కిలో మీటరు నుంచి అంటే ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల నుంచి కాలువలో నీరు ఎత్తిపోయాల్సి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ఎడమ కాలువ పనులు పడకేశాయి.

కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు పోలవరం ఎడమ కాలువ పనులతో పాటు ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు వేగం పుంజుకున్నాయి. వాస్తవానికి రెవెన్యూ శాఖ అంచనాల ప్రకారం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి మొత్తం 16.45 వేల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటిదాక కేవలం 7 వేల ఎకరాలు మాత్రమే భూసేకరణ పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు అన్ని విధాలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టాల్సిన భూసేకరణ పనులు త్వరలోనే పూర్తిచేసి పథకం పనులు వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

భూ సేకరణకు చర్యలు

పోలవరం ఎడమ కాలువ, అక్విడెక్టుల నిర్మాణ పనులకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. పోలవరం ఎడమ కాలువ పనులతో పాటు పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల్లో అర్ధాంతరంగా నిలిచిన అక్విడెక్టు పనులు పునఃప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన పనులు చేపట్టేందుకు రూ.800 కోట్ల అంచనాలతో ప్యాకేజీల వారీగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయడమే కాకుండా సుజల స్రవంతి పథకం ద్వారా ఉత్తరంధ్రకు జూలై నెలాఖరు నాటికి గోదావరి జలాలను అందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గతంలోనే ప్రకటించారు. తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 605.75 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా తొలిదశలో పూర్తి చేయాల్సిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా భూసేకరణ విభాగం అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. పథకం భూసేకరణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ రమామణి ఆధ్వర్యంలో భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే భూసేకరణ పనులను పూర్తి చేస్తామని, అనకాపల్లి, సబ్బవరం, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో భూసేకరణ కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు ’ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి రమామణి తెలిపారు.

Updated Date - Mar 09 , 2025 | 12:54 AM