మరిన్ని అన్న క్యాంటీన్‌లు!
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:21 AM
పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లు జిల్లాలో మరికొన్ని ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే అనకాపల్లిలో రెండు, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లో ఒక్కొక్కటి చొప్పున క్యాంటీన్లు నడుస్తున్న విషయం తెలిసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో ఒకటి చొప్పున అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అంతేకాక ఇప్పటికే క్యాంటీన్లు నిర్వహిస్తున్న మూడు నియోజకవర్గాల్లో మరొకటి చొప్పున అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద జిల్లాలో కొత్తగా ఆరు క్యాంటీన్లు ఏర్పాటవుతాయి. ఈ మేరకు జిల్లాలో ఎక్కడక్కెడ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలో అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం
జిల్లాలో ఇప్పటికే అనకాపల్లిలో రెండు, నర్సీపట్నం, ఎలమంచిలిలో ఒక్కో క్యాంటీన్
ఈ పట్టణాలతోపాటు ‘పేట, మాడుగుల, చోడవరంలో క్యాంటీన్లు
కొత్తగా ఆరు క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించడానికి అధికారులు సిద్ధం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లు జిల్లాలో మరికొన్ని ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే అనకాపల్లిలో రెండు, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణాల్లో ఒక్కొక్కటి చొప్పున క్యాంటీన్లు నడుస్తున్న విషయం తెలిసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో ఒకటి చొప్పున అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అంతేకాక ఇప్పటికే క్యాంటీన్లు నిర్వహిస్తున్న మూడు నియోజకవర్గాల్లో మరొకటి చొప్పున అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద జిల్లాలో కొత్తగా ఆరు క్యాంటీన్లు ఏర్పాటవుతాయి. ఈ మేరకు జిల్లాలో ఎక్కడక్కెడ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలో అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.
తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు పట్టణాల్లో శ్రామికులు, రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, దుకాణాల్లో పనిచేసే చిరుద్యోగులు, గ్రామాల నుంచి వివిధ పనులపై పట్టణాలకు వచ్చే వారికి రూ.5 నామమాత్రం రేటుతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ‘అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చింది. నాడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం, రైల్వేస్టేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్‌కు వెళ్లే మార్గంలో 2018 జూలై 11వ తేదీన అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ప్రతి రోజూ ఉదయం 300-400 మంది అల్పాహారం, మధ్యాహ్నం 500-600 మంది, రాత్రి 300-400 మందికి భోజనం పెట్టేవారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎదురుగా 2019 జనవరి 11న అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి, ప్రస్తుత శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఉదయం అల్పాహారం 350 మందికి, మధ్యాహ్నం భోజనం 350 మందికి, రాత్రి భోజనం 250 మందికి వడ్డించేవారు. ఎలమంచిలిలో అదే ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. తరువాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అన్న క్యాంటీన్ల నిర్వహణపై శీతకన్ను వేసింది. అల్పాహారం 150 మందికి, భోజనాలు 200 మందికి కుదించారు. అయినా సరే కొనసాగించకుండా 2019 ఆగస్టులో అన్న క్యాంటీన్లను వైసీపీ పాలకులు మూసివేయించారు. మీకు నచ్చిన పేరు పెట్టుకుని, క్యాంటీన్లను కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబుతోసహా పలువురు నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ వైసీపీ పాలకులు ససేమిరా అన్నారు. దీంతో ఆయా భవనాలు నిరుపయోగంగా మారాయి. లోపల సామగ్రి పాడైపోయింది.
ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తెరిపిస్తామని గత ఏడాది ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం చేర్చారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు. నర్సీపట్నంలో సెప్టెంబరు 18వ తేదీన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, 19వ తేదీన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి, రైల్వే స్టేషన్ వద్ద, ఎలమంచిలిలో అక్టోబరు మూడో తేదీన ఎమ్మెల్యే విజయ్‌కుమార్ అన్న క్యాంటీన్‌లను పారంభించారు. కాగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక క్యాంటీన్‌ను ఏర్పాటు చేసే అంశంపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. సాధ్యమైనంత త్వరగా కొత్త క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిప్రకారం జిల్లాలో ప్రస్తుతం అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతోపాటు (అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి) కొత్తగా మాడుగుల, చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు క్యాంటీన్ల ఏర్పాటుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే స్థలాలను ఎంపిక చేసి భవన నిర్మాణ పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు.