శరవేగంగా అమీబా కాటేజీల ఆధునికీకరణ పనులు
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:03 AM
అరకులోయలోని అమీబా కాటేజీల ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాటేజీలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు. నెల రోజుల్లో ఈ పనులు పూర్తయి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి.

- నెల రోజుల్లో పనుల పూర్తికి చర్యలు
అరకులోయ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): అరకులోయలోని అమీబా కాటేజీల ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాటేజీలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు. నెల రోజుల్లో ఈ పనులు పూర్తయి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి.
అరకులోయలో 1996లో అమీబా ఆకారంలో 13 కాటేజీలను నిర్మించారు. 2014 వరకు వీటిని పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో పర్యాటకులకు విడిదికి ఇచ్చేది. ఆ తరువాత దానిని పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారైంది. తుప్పల మధ్య ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని తాము నిర్వహించుకుంటామని ఐటీడీఏ చెప్పడంతో పర్యాటక శాఖ అప్పగించడానికి నిరాకరించింది. ఎట్టకేలకు 2024లో అమీబా కాటేజీల ఆధునికీకరణకు పర్యాటక శాఖ నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 13 కాటేజీలకు గాను ఏడు కాటేజీల ఆధునికీకరణ పనులను పూర్తి చేశారు. కాటేజీ లోపల గదులను అందంగా తీర్చిదిద్దారు. నెల రోజుల్లో ఆధునికీకరణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఏపీటీడీసీ ఈఈ రమణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.