Share News

అర్ధరాత్రి హత్య

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:12 AM

మద్యం మత్తులో ఒక యువకుడు విచక్షణ కోల్పోయి బండరాయితో తలపై మోది వృద్ధుడిని హత్య చేశాడు.

అర్ధరాత్రి హత్య

  • వృద్ధుడిని తలపై బండరాయితో మోది హత్య చేసిన యువకుడు

  • మద్యం మత్తులో ఘాతుకం

విశాఖపట్నం/వెంకోజీపాలెం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):

మద్యం మత్తులో ఒక యువకుడు విచక్షణ కోల్పోయి బండరాయితో తలపై మోది వృద్ధుడిని హత్య చేశాడు. వెంకోజీపాలెం జంక్షన్‌లో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామ్‌నగర్‌లోని పాత రఘు కాలేజీ సమీపంలో నివాసం ఉంటున్న కనటి ఆనందరావు (67) తాపీమేస్ర్తీ. మద్యానికి బానిసైన ఆనందరావు నరాల సమస్యతోపాటు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఆనందరావును కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుడికి చూపించిన తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో మద్యం తాగడానికి కుటుంబ సభ్యులను ఆనందరావు డబ్బులు అడగ్గా, ఇవ్వకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో వెంకోజీపాలెం జంక్షన్‌లో హనుమాన్‌ విగ్రహం వద్ద ఉన్న నూడిల్స్‌ దుకాణం పక్కన ఫుట్‌పాత్‌పై ఆనందరావు కూర్చుని ఉన్నాడు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనమల్లుపేటకు చెందిన చనమల్లు శ్రీనివాసరావు (24) రాత్రి 12 గంటల సమయంలో ఆనందరావు కూర్చున్న సమీపంలోని నూడిల్స్‌ దుకాణం వద్దకు వచ్చాడు. శ్రీనివాసరావు గతంలో సీతమ్మధారలోని రాజుస్‌ కిచెన్‌లో తండూరీ మాస్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం పీఎం పాలెంలో కొత్తగా ప్రారంభించిన రాజూస్‌ కిచెన్‌ బ్రాంచిలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి 10.30 గంటలకు పీఎం పాలెంలో పని ముగించుకున్న శ్రీనివాసరావు సీతమ్మధారలోని స్నేహితులను కలిసేందుకు బైక్‌పై వచ్చాడు. స్నేహితుడితో కలిసి వెంకోజీపాలెంలోని ఒక బార్‌లో మద్యం సేవించాడు. అక్కడి నుంచి తనకు పరిచయస్తుడైన నూడిల్స్‌ షాప్‌ నిర్వాహకుడి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసరావు నూడిల్స్‌ దుకాణం పక్కన కూర్చుని ఉన్న ఆనందరావు వద్ద గట్టిగా అరిచాడు. దీంతో ఆనందరావు ఎందుకలా అరుస్తున్నావంటూ? ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు తోసుకోవడంతో మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసరావు కిందపడిపోయాడు. అనంతరం లేచి ఆనందరావును కొట్టడంతో శ్రీనివాసరావును నూడిల్స్‌ దుకాణం నిర్వాహకుడు అడ్డుకున్నాడు. కొంతసేపు ఆగిన తర్వాత శ్రీనివాసరావు విచక్షణ కోల్పోయి ఒక్కసారిగా పక్కనే ఉన్న బండరాయిని తీసి ఆనందరావు తలపై మోదాడు. దీంతో ఆనందరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్యచేసిన శ్రీనివాసరావు అక్కడి నుంచి భయంతో బైక్‌పై పీఎంపాలెం ఆర్‌హెచ్‌ కాలనీలో తాను ఉంటున్న రూమ్‌కు వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం పారిశుధ్య నిర్వహణ సిబ్బంది నూడిల్స్‌ దుకాణం వద్ద ఉన్న ఆనందరావు మృతదేహాన్ని చూసి యాచకుడు చనిపోయాడంటూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ఎవరో బండరాయితో మోది హత్య చేసినట్టు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఎంవీపీ కాలనీ స్టేషన్‌ సీఐ జె.మురళీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ప్యాంటు జేబులో ఆధార్‌ కార్డు లభించడంతో అందులోని చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నూడిల్స్‌ దుకాణం నిర్వాహకుడిని దీనిపై ప్రశ్నించగా మొదట తనకేమీ తెలియదని బుకాయించినప్పటికీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో శ్రీనివాసరావు హత్య చేసినట్టు వివరించాడు. నూడిల్స్‌ దుకాణం నిర్వాహకుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ మురళీ తెలిపారు.

Updated Date - Feb 26 , 2025 | 01:12 AM