మాతాశిశు మరణాలు సంభవిస్తే ఉపేక్షించను
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:36 PM
గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మాతాశిశు మరణాలు సంభవిస్తే ఉపేక్షించబోనని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ హెచ్చరించారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుంచి తొలగింపు
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ హెచ్చరిక
పాడేరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మాతాశిశు మరణాలు సంభవిస్తే ఉపేక్షించబోనని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తేవారి ఉద్యోగాలను తొలగిస్తానని ఘాటుగా హెచ్చరించారు. ఏజెన్సీలో జర్రెల, డౌనూరు, గెమ్మిలి, డుంబ్రిగుడ, ఆర్వీనగర్, ధారకొండ, ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపై ఆరా తీశారు. హైరిస్క్ గర్భిణులను ప్రసవ సమయానికి పది రోజులు ముందుగా బర్త్ వెయిటింగ్ హాలులో చేర్పించి సుఖ ప్రసవం జరిగేలా వైద్య సేవలు అందించాలని, అందుకు ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే గర్భిణుల మరణాలకు గల కారణాలు, వారికి అందించిన వైద్య సేవలు, పరీక్షలు, వ్యాధి నిర్ధారణలను అడిగి తెలుసుకున్నారు. హుకుంపేట మండలం ఉప్ప పీహెచ్‌సీ పరిధిలోని మరణాలపై సమీక్షిస్తూ సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ప్రసవాలు పెరిగేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్థం చేయాలన్నారు. గర్భిణులు ఆస్పత్రుల్లో చేరేందుకు నిరాకరించినప్పుడు వైద్యులు, సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందిస్తే సకాలంలో స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమాచారం అందించినా స్పందించకపోతే తన దృష్టికి తీసుకుని వస్తే వారిపై చర్యలు చేపడతామన్నారు. జీకేవీధి మండలం బూరుగుపాలెం అంగన్‌వాడీ వర్కర్ జి.రాజ్యలక్ష్మి కొత్తవాడు గ్రామంలో మృతి చెందిన బాలింత కిండేరిదీన టేక్ హోమ్ రేషన్‌ను కుటుంబ సభ్యులకు అందించడంతో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. కొయ్యూరు మండలం రెల్లలపాలెం అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో మృతి చెందిన డూరి కృష్ణకుమారి రేషన్‌ను బంధువులకు పంపిణీ చేయడంతో అక్కడ అంగన్‌వాడీ కార్యకర్తలను సస్పెండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సి.జమాల్ బాషా, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త కె.కృష్ణారావు, వైద్యులు, సీడీపీవోలు, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.