Share News

వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:02 AM

భర్త వికృత చేష్టలు, లైంగిక వేధింపులను తట్టుకోలేని వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

భర్త వికృత చేష్టలు, వేధింపులే కారణం

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

గోపాలపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):

భర్త వికృత చేష్టలు, లైంగిక వేధింపులను తట్టుకోలేని వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో గల నందమూరి నగర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గాజువాక ప్రాంతానికి చెందిన వసంత (24)కు, 92వ వార్డు నందమూరి నగర్‌కు చెందిన చిక్కాల నాగేంద్రబాబుకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే నాగేంద్రబాబు పెళ్లైనప్పటి నుంచి భార్యను వేధించేవాడు. ఆమెకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ, వికృత చేష్టలకు పాల్పడేవాడు. అంతేకాకుండా లైంగిక వాంఛను ప్రేరేపించే మాత్రలు తీసుకువచ్చి, వాటిని వేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేసేవాడు. దీంతో దంపతుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి మరోసారి గొడవ జరిగింది. అనంతరం రాత్రి పది గంటల సమయంలో నాగేంద్రబాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త చేష్టలకు విసిగిపోయి, తీవ్ర మనస్తాపానికి గురైన వసంత తన గదిలోకి వెళ్లి సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. దంపతుల మధ్య పెద్ద గొడవ జరగడాన్ని గమనించిన సమీప ప్రాంతాల వాసులు నాగేంద్రబాబు బయటకు వెళ్లిపోయిన తరువాత అతడి ఇంట్లోకి వెళ్లారు. గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు వసంత ఉరివేసుకుని వేలాడుతుండడాన్ని గమనించి, వెంటనే ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వసంత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి వెంకటరమణ శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నాగేంద్రబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి వద్ద కామవాంఛను ప్రేరేపించే మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Feb 15 , 2025 | 01:02 AM