Share News

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..

ABN , Publish Date - Feb 02 , 2025 | 12:41 AM

పెళ్లి సంబంధాలు వచ్చినా కుదరక పోతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..
శివరామ్‌ మృతదేహం

మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో దూకి యువకుడి ఆత్మహత్య

గోపాలపట్నం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పెళ్లి సంబంధాలు వచ్చినా కుదరక పోతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాతయ్యపాలెం ప్రాంతానికి చెందిన దేవవరపు శివరామ్‌ (28) తల్లి రాజేశ్వరి, సోదరుడు హరిరాజుతో కలిసి నివసిస్తున్నాడు. సంతల్లో పలు వస్తువులు విక్రయిస్తూ జీవనోపాధి పొందే శివరామ్‌కు మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు. ఇటీవల పెళ్లి సంబంధాలు కుదిరినప్పటికీ, ఆ తర్వాత రద్దవుతుం డడంతో మనస్తాపానికి గురై ముభావంగా ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చిన శివరామ్‌ తన సోదరుడికి ఫోన్‌ చేసి మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు వచ్చానన్నాడు. శివరామ్‌ మానసిక స్థితి తెలిసి ఆందోళనకు గురైన హరిరాజు తమ బంధువులతో కలిసి రిజర్వాయర్‌ వద్దకు వచ్చాడు. అక్కడ శివరాజు ద్విచక్ర వాహనాన్ని, సమీపంలో జలాశయం గట్టు వద్ద చెప్పులను గుర్తించారు. సోదరుడు కనిపించకపోవడంతో వెంటనే హరిరాజు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని రిజర్వాయర్‌లో గాలింపు చర్యలు చేపట్టడంతో శివరామ్‌ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించి పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 02 , 2025 | 12:41 AM