నేడు, రేపు మన్యం బంద్
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:45 PM
గిరిజన ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి 1/70 చట్టం కారణంగా విఘాతం ఏర్పడుతున్నదని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం నుంచి రెండు రోజుల బంద్‌కు అఖిలపక్షం సన్నద్ధమైంది.

అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా బంద్ పాటించేందుకు అఖిలపక్షం సన్నద్ధం
పాడేరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి 1/70 చట్టం కారణంగా విఘాతం ఏర్పడుతున్నదని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం నుంచి రెండు రోజుల బంద్‌కు అఖిలపక్షం సన్నద్ధమైంది. ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా సహకరించి విజయవంతం చేయాలని కోరారు. అయ్యన్న వ్యాఖ్యలపై ఏజెన్సీ ప్రాంతంలో వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నప్పటికీ స్పీకర్ లేదా టీడీపీ అధిష్ఠానం కనీసం స్పందించడం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్న గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 48 గంటల బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేసి తమ సత్తా చాటుతామని అఖిలపక్ష నాయకులు చెబుతున్నారు. అయితే బంద్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ బస్సులను పోలీసుల సహకారంతో నడిపేందుకు సిద్ధమవుతున్నారు. కాగా బంద్ నేపథ్యంలో దుకాణాలు, హోటళ్లు మూసేయాలని, ప్రైవేటు వాహనాలను నిలుపుదల చేయాలని ఇప్పటికే ఆందోళనకారులు సూచించారు.
బంద్‌కు సహకరించాలని కలెక్టర్‌కు వినతులు
స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చేపడుతున్న రెండు రోజుల బంద్‌కు పోలీసుల నుంచి ఎటువంటి అడ్డంకులు తలెత్తకుండా సహకరించేలా చూడాలని కోరుతూ సోమవారం అఖిల పక్షం నేతలు, జేఏసీ నేతలు వేర్వేరుగా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్‌కు వినతిపత్రాలు సమర్పించారు. తాము 11, 12 తేదీల్లో బంద్‌ను పాటిస్తామని వైసీపీ, సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పడిన అఖిలపక్షం పేర్కొనగా, తాము కేవలం 12న మాత్రమే బంద్‌ను పాటిస్తామని ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు.